
ఖమ్మం సహకారనగర్: లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సక్రమంగా, సాఫీగా సాగేలా సంబంధిత అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఖమ్మం లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్ సూచించారు. పోలీస్ కమిషనర్ సునీల్‌దత్‌తో కలిసి మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన అదికారులతో సమావేశమయ్యారు. నామినేషన్ల స్వీకరణ సమయాన పరిశీలించాల్సిన పత్రాలు, అభ్యర్థులకు ఇవ్వాల్సిన సూచనలకు అధికారులకు వివరించారు. కాగా, కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన హెల్ప్‌డెస్క్‌ల ద్వారా నామినేషన్ పత్రాలు నింపడం, జత చేయాల్సిన పత్రాలపై అభ్యర్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కాగా, కలెక్టరేట్‌లో భద్రతా ఏర్పాట్లను కలెక్టర్, సీపీ పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ సమయాన పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేయాలని, రిటర్నింగ్ అధికారి చాంబర్ నుండి 100 మీటర్ల పరిధిలో బందోబస్తు ఉండాలని తెలిపారు. ఆపై సీసీ కెమెరాలను పరిశీలించి ఉద్యోగులకు సూచనలు చేశారు.
విధులపై అవగాహన ఉండాలి
ఎన్నికల విధులపై ఉద్యోగులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్, 85ఏళ్లు పైబడిన వయోవృద్ధులు, దివ్యాంగులకు హోం ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించినందున అర్హులకు అవగాహన కల్పించాలన్నారు. ఆతర్వాత నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన ఆధ్వర్యాన నిర్వహించని వీసీలో పాల్గొన్న కలెక్టర్ గౌతమ్.. జిల్లాలో ఏర్పాట్లను వివరించారు. ఈసమావేశాల్లో అదరపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, అసిస్టెంట్ కలెక్టర్లు మాయంక్ సింగ్, యువరాజ్, మ్రినాల్ శ్రేష్ఠ, డీఆర్వో ఎం.రాజేశ్వరి, అదనపు డీసీపీ ప్రసాదరావు, డీసీఓ మురళీధర్‌రావు, జిల్లా ఉపాధికల్పన అధికారి కె.శ్రీరామ్, కలెక్టరేట్ ఏఓ అరుణ, ఏసీపీ రమణమూర్తి, జెడ్పీ సీఈఓ వినోద్, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఏఓ విజయనిర్మలతో పాటు ఉద్యోగులు మదన్‌గోపాల్, రాంబాబు, పాల్గొన్నారు.
4గంటల తర్వాతే కలెక్టరేట్‌కు రండి
లోక్‌సభ ఎన్నికల నామినేషన్లు ఈనెల 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కలెక్టరేట్‌లో స్వీకరించనున్నందున ఇతర దరఖాస్తులు ఇచ్చేందుకు సాయంత్రం 4గంటల నుంచి 6గంటల వరకు రావాలని కలెక్టర్ సూచించారు. మిగతా సమయంలో వచ్చి ఇబ్బంది పడొద్దని తెలిపారు.
నామినేషన్ల స్వీకరణ
సాఫీగా సాగాలి...
జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ గౌతమ్