మున్నేటి బ్రిడ్జి పైనుంచి దూకడంతో యువతి మృతి ?
ఖమ్మంరూరల్: బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి కుటుంబంతో వచ్చిన ఓ యువతి మృత్యువాత పడింది. ఖమ్మం రూరల్ మండలంలో జరిగిన ఈ ఘటన వివరాలు... ఒడిశా రాష్ట్రం కలహండి జిల్లా కందపాడు గ్రామానికి చెందిన దైతారి కందా తన భార్య దీపాంజలి, కుమార్తె జెమామణి కందా(17), కుమారుడు కై బాల్య కందాతో కలిసి మూడు నెలల క్రితం ప్రకాష్‌నగర్‌లో మున్నేటి పక్కన ఇటుక బట్టీలో పని చేయడానికి వచ్చాడు. రోజులాగే పని ముగించుకుని గురువారం రాత్రి నిద్రించగా శుక్రవారం తెల్లవారుజామున జెమామణి కనిపించలేదు. చుట్టుపక్కల వెతుకుతుండగా మున్నేటి ఒడ్డున ఆమె మృతదేహం కనిపించింది. జెమామణి ముఖం, పెదవులు, కుడికన్నుపై చిన్న గాయాలు ఉండడమే కాక ఒక కాలు విరిగి ఉంది. మున్నేటిపై ప్రకాష్‌నగర్ వద్ద ఉన్న బ్రిడ్జి పైనుంచి దూకడంతో ఆమె మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని చేపలు కొరకడంతో గాయాలై ఉంటాయని తెలుస్తోంది. కాగా, జెమామణి అనారోగ్యం లేదా ఇతర కారణాలతో దూకి ఉంటుందని ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ముష్క రాజు తెలిపారు. ఆమె మృతదేహాన్ని అన్నం పౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో బయటకు తీయించారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడు..
తల్లాడ: తల్లాడ మండలం అంజనాపురానికి చెందిన ఓ యువకుడు శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అంజనాపురం గ్రామంలో నాయనమ్మ ఇంట్లో మూడ్ పవన్(23) జీవిస్తున్నాడు. గురువారం రాత్రి ఆయన ఇంటి ఎదుట కొందరు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కడుతుండగా పవన్ అడ్డుచెప్పాడు. దీంతో ముగ్గురు ఆయనపై దాడి చేస్తుండగా స్థానికుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అయితే, శుక్రవారం ఉదయంకల్లా ఆయన ఇంట్లో కూర్చున్న స్థితిలో చీరతో ఉరి వేసుకుని కనిపించాడు. ఈ విషయాన్ని బంధువులు గుర్తించగా ఆయన పెదనాన్న కొడుకు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎన్.వెంకటకృష్ణ తెలిపారు.
గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం
ఖమ్మంక్రైం: సాగర్ కాల్వలో ఈనెల 24వ తేదీన ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు గల్లంతైన యడ్ల శశాంక్ (14) మృతదేహం శుక్రవారం లభ్యమైంది. అదేరోజు ఆయన స్నేహితుడు సుహాన్ మృతదేహం లభ్యమైన విషయం విదితమే. అప్పటి నుంచి గాలిస్తుండగా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి ప్రాంతంలోని సాగర్ కాల్వలో శశాంక్ మృతదేహాన్ని గుర్తించారు. పంచనామా అనంతరం సుల్తాన్ బజార్‌లోని ఇంటికి తీసుకెళ్లగా ఆయన తల్లిదండ్రులు మాధవి – లక్ష్మణ్ గుండెలవిసేలా రోదించారు. బీఆర్‌ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, కార్పొరేటర్ క్లెమెంట్, నాయకులు షకీనా, వీరబాబు తదితరులు కుటుంబీకులను పరామర్శించారు
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
ఖమ్మంక్రైం: ఖమ్మం పంపింగ్‌వెల్ రోడ్ ప్రాంతానికి చెందిన నాగుల్‌మీరా(50) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సెంట్రింగ్ మేసీ్త్రగా పనిచేసే ఆయన కుటుంబ కలహాలతో నర్తకి థియేటర్ సమీపాన గురువారం అర్ధరాత్రి దాటాక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని గుర్తించగా అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపారు.
మున్నేటి బ్రిడ్జి పైనుంచి దూకడంతో యువతి మృతి ?


