చరిత్రలో నిలిచిపోయేలా బహిరంగసభ
ఖమ్మంమయూరిసెంటర్: కమ్యూనిజం అజేయం, అజరామరమని.. మరో వందేళ్లు ప్రజల హృదయాల్లో నిలిచి వుంటుందని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు తెలిపారు. సీపీఐ వందో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఖమ్మంలోని జిల్లా కార్యాలయంలో హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం హేమంతరావు మాట్లాడుతూ ఆవిర్భావం నుంచి అనేక నిర్భందాలు ఎదురైనా ప్రజల పక్షాన నిలవడమే కాక వారి సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకులు పాటుపడ్డారని తెలిపారు. కాగా, వచ్చేనెల 18న ఖమ్మంలో నిర్వహించే శత వార్షిక సభ చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ తో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి వేలాదిగా కార్యకర్తలు, వివిధ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఈ సభ విజయవంథానికి జనవరి 1నుంచి ప్రచారం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మెన్ మహ్మద్ మౌలానా, నాయకులు జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, ఎస్.కే.జానిమియా, మందడపు రాణి, ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, అజ్మీరా రామ్మూర్తి తది తరులు పాల్గొన్నారు. అనంతరం సీపీఐ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లను సన్మానించారు.
సీపీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నాయకులు


