
రామయ్య కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో బుధవారం వైభవంగా నిర్వహించారు. సీతారాముల వారి ఉత్సవమూర్తులను మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణ ఘటాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కల్యాణ రామయ్యను దర్శించుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని రామయ్య భక్తుల ఆహ్వానం మేరకు ఈనెల 25వ తేదీ వరకు పది పట్టణాల్లో రామయ్య కల్యాణం నిర్వహించనున్నట్లు భద్రాద్రి ఆలయ అధికారులు తెలిపారు.
నేటినుంచి ఉమ్మడి జిల్లా క్రీడా జట్ల ఎంపిక
కొత్తగూడెంటౌన్: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల స్థాయి పాఠశాల క్రీడాకారుల జట్లను ఈ నెల 16, 17వ తేదీల్లో ఎంపిక చేయనున్నట్లు డీఈఓలు సోమశేఖరశర్మ, వెంకటేశ్వరాచారి తెలిపారు. ఈ నెల 16న కొత్తగూడెం రామవరంలోని ఎస్‌ఆర్ ప్రైమ్ స్కూల్‌లో సెపక్‌తక్రా, 17వ తేదీన అండర్–14, 17 విభాగాల్లో సైక్లింగ్ ఎంపిక పోటీలు పాల్వంచలోని సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. అన్ని పాఠశాలల నుంచి క్రీడాకారులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా పీఈటీలు చొరవ చూపాలని డీఈఓలు సూచించారు.
17, 18వ తేదీల్లో..
ఖమ్మంస్పోర్ట్స్: జిల్లా పాఠశాలల క్రీడా సంఘం ఆధ్వర్యాన ఈ నెల 17, 18 తేదీల్లో ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడా జట్ల ఎంపిక పోటీలు ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల క్రీడా కార్యదర్శులు కె.నర్సింహమూర్తి, స్టెల్లా ప్రేమ్ నిరంజన్ తెలిపారు. అండర్–14 బాస్కెట్‌బాల్ బాలబాలికల ఎంపిక పోటీలు ఈ నెల 17, అండర్–17 బాస్కెట్‌బాల్, అండర్–14, 17 టగ్ ఆఫ్ వార్ బాలబాలికల ఎంపిక పోటీలు 18న జరుగుతాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటలకు రిపోర్ట్ చేయాలని సూచించారు.