శివాజీనగర: సంచలనాత్మక కేపీఎస్‌సీ ఉద్యోగ నియామకాల కుంభకోణంలో కేంద్ర ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైకోర్టులో షాకింగ్ సమాచారాన్ని వెల్లడించింది. కేసు దర్యాప్తు పురోగతి నివేదికను కోర్టు ముందుంచింది. కేఏఎస్, ఏఈఈ, ఎంవీఐ ఉద్యోగ నియామక పరీక్షలలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు చేసింది. ఓఎంఆర్ షీట్ల సవరణలు, అభ్యర్థుల నుంచి కోట్లాది రూపాయల వసూళ్లు, నకిలీ సమాధాన పత్రాల సృష్టి వంటి అంశాలపై దర్యాప్తు జరపాల్సి ఉందని ఈడీ కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.
పశు వైద్యాధికారుల నుంచి గుట్టురట్టు
పశు వైద్యాధికారుల ఉద్యోగాల భర్తీలో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.70 లక్షల వరకూ వసూలుచేసి పోస్టును ఇచ్చారనే కేసులో ఈడీ అడుగు పెట్టగా మరిన్ని కుంభకోణాలు గుట్టురట్టయినట్లు తెలుస్తోంది. హైకోర్టులో పలు సంచలనాత్మక వివరాలను వెల్లడించారు. ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ, కేపీఎస్‌సీ నిర్వహించిన ఇతర నియామక పరీక్షలలో కూడా బాగోతాలు జరిగాయని అనుమానం వ్యక్తం చేసింది. ఆయా కేసుల్లోనూ దర్యాప్తు చేయాల్సి ఉందని తెలిపింది.
షీట్లు తారుమారు, ఫుటేజీలు మాయం
జనవరి 23, 2025న జరిగిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏడబ్ల్యూ) పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఈడీ పేర్కొంది. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను తారుమారు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. పరీక్షా కేంద్రాల సీసీ కెమెరాల ఫుటేజ్ అందుబాటులో లేకపోవడం అనేక అనుమానాలకు దారితీసింది. అంతేకాకుండా, సెలక్షన్ కమిటీ చైర్మన్, ఇతర సభ్యులు సమావేశానికి గైర్హాజరు అయినా కూడా ఏకపక్షంగా అభ్యర్థుల ఎంపిక జాబితాను ఖరారు చేశారని ఈడీ ఆరోపించింది. 10 మంది అభ్యర్థుల నియామకంపై కూడా విచారణ జరగాల్సి ఉందని ఈడీ తెలిపింది. దీంతో కేపీఎస్‌సీ పెద్దల చుట్టూ ఉచ్చు బిగిసినట్లయింది.
లక్షల రూపాయలు ముట్టజెప్పినవారికే కొలువులన్న ఈడీ
నిజాయితీగా పరీక్ష రాసిన ఎంతోమందికి అన్యాయం
కేపీఎస్‌సీపై హైకోర్టుకు ఈడీ నివేదిక
ఇంజినీర్లు, ఎంవీఐ పోస్టుల భర్తీలోనూ అవకతవకలు
అభ్యర్థుల నుంచి రూ.కోట్ల వసూళ్లు
ఆ కేసుల్లోనూ దర్యాప్తునకు ఈడీ వినతి
అధికారులు, సిబ్బంది పాత్ర
మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ), అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులను అమ్మేసుకున్నారని ఈడీ ఆరోపించింది. ఇందులో ముడుపులు తీసుకున్న టి.ప్రకాష్ చేతిరాత కలిగిన నోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో కేపీఎస్‌సీకి చెందిన 21 మంది అధికారులు, సిబ్బంది పాత్ర గురించి కూడా సమాచారం బయటకు వచ్చింది. కాబట్టి ఇతర పరీక్షలలోని అవకతవకలపై కూడా సమగ్ర దర్యాప్తు జరపాలని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈడీ సమర్పించిన సమాచారాన్ని పరిశీలించిన జడ్జి జస్టిస్ నాగప్రసన్న ఆశ్చర్యం వ్యక్తంచేశారు. ఈ ఆరోపణలు నిజమైతే ఇది చాలా దిగ్భ్రాంతికరమని పేర్కొన్నారు.
కేఏఎస్ అభ్యర్థుల నుంచి కోట్ల వసూళ్లు
2023 సంవత్సరం కేఏఎస్ గెజిటెడ్ ప్రొబేషనరీ అధికారుల నియామకంలో స్కాం జరిగినట్లు ఈడీ ఆరోపించింది. ప్రకాష్ అనే వ్యక్తి నుంచి పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఐఏఎస్ జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ సన్నిహితుడైన ఇతడు .. అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలున్నాయి. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.40 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు వసూలు చేసి జ్ఞానేంద్రకు ఇచ్చినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు.


