ఆదివారం రాత్రి పసిబిడ్డతో ఆశా
తమ డిమాండ్ల ఫ్లెక్సీతో ఆశా కార్యకర్తలు
శివాజీనగర: బెంగళూరులోని ఫ్రీడం పార్క్‌లో గత వారం రోజులుగా ఆశా కార్యకర్తలు పగలు, రాత్రి నిరసన తెలుపుతున్నారు. రూ.15 వేల గౌరవ వేతనంతో పాటు పలు డిమాండ్లను నెరవేర్చాలని నినదిస్తున్నారు. రోజుల తరబడి ఆరుబయట ఉండడంతో 12 మంది ఆశా కార్యకర్తలు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చేరారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో చాలామంది ఆశా కార్యకర్తలు ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. కొంతమందితో ఆందోళన నడుస్తోంది. ఆశాలకు పలువురు ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది.
వేతనం పెంచలేరా: అశోక్
బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలప్పుడు మాత్రమే, మహిళలు గుర్తుకు వస్తారు, హామీల పేరుతో మహిళల ఓట్లు అడిగే కాంగ్రెస్‌కు, వీధుల్లోకి వస్తున్న అదే మహిళల ఆక్రందనలు వినిపించడం లేదు. వారు కనబడటం లేదు అని దుయ్యబట్టారు. వారి సేవలకు తగిన గౌరవ వేతనం చెల్లిస్తే మీ ఖజానా ఖాళీ అవుతుందా అన్నారు. కాంగ్రెస్ అసంతృప్త నేతలకు పదవుల పేరుతో కోట్ల రూపాయలు జీతభత్యాలు ఇస్తున్నారని ఆరోపించారు. మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా ఆశా కార్యకర్తల గౌరవ వేతనాన్ని పెంచడానికి డబ్బులు లేవా? అని ప్రశ్నించారు.
మానవత్వం చూపాలి: సుమలత
ఆశా కార్యకర్తల పోరాటానికి మద్దతు తెలుపుతూ నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీష్ సీఎం డీకే శివకుమార్‌కు లేఖ రాశారు. చలి మధ్య పగలూ రాత్రి ధర్నా చేస్తున్న మహిళల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అన్నారు. వారి గౌరవ వేతనాన్ని రూ.15 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. మానవత్వంతో సత్వరం న్యాయం అందించాలని కోరుతున్నానన్నారు.
రమ్య మద్దతు
ఆశాల నిరసనకు నటి రమ్య మద్దతు తెలిపారు. ఆశాల ధర్నా వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రజారోగ్య వ్యవస్థలో ఆశా కార్యకర్తల సహకారం అపారమైనదని, వారికి గౌరవప్రదమైన జీతాలు సకాలంలో అందాలని, పెండింగ్ డిమాండ్లను తీర్చాలని విన్నవించారు.
వారానికి చేరిన నిరవధిక ధర్నా


