● తల్లి ముందే యువతి దుర్మరణం
మండ్య: మండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం తాలూకాలోని చిందగిరి కొప్పలు గ్రామం సమీపంలో వేగంగా వస్తున్న రైలు ఢీకొని ఒక యువతి దుర్మరణం చెందింది. మృతురాలు అదే గ్రామానికి చెందిన సురేష్ కుమార్తె, బీసీఏ విద్యార్థిని సీఎస్ లిఖిత (19). వివరాలు.. లిఖితను తల్లి భవ్య, ప్రతి ఉదయం గ్రామం నుంచి స్కూటర్‌లో పాండవపుర పట్టణానికి వెళ్లి దింపి, తిరిగి తీసుకువచ్చేది. ఎప్పటిలాగే, శనివారం కుమార్తెను స్కూటర్‌లో ఇంటికి తీసుకువస్తోంది. గ్రామం దగ్గర రైల్వే గేటు ఉంది, అక్కడ రైలు వస్తుండగా లిఖిత ఉత్సాహంగా స్కూటర్ దిగి రైలుకు దగ్గరగా వెళ్లి సెల్ఫీ వీడియో తీసుకోవాలని వెళ్లినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. వేగంగా వస్తున్న రైలు తగలడంతో ఆమె పట్టాలపై పడి దుర్మరణం చెందింది. కళ్లముందే జరిగిన దుర్ఘటనతో తల్లి దిగ్భ్రాంతితో కుప్పకూలిపోయింది. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. కేసు నమోదు చేశారు.


