యశవంతపుర: అతివేగంగా కారును నడిపి ఓ ఇంటి కాంపౌండ్ను ఢీకొట్టి, ఆపై రచ్చ చేసిన మందుబాబును బెంగళూరు బ్యాడరహళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలప్పుడు మహదేశ్వరనగర మెయిన్ రోడ్డులో ఓ ఆస్పత్రి వద్ద సచిన్ అనే వ్యక్తి అతివేగంగా కారును నడిపి ప్రహరీని ఢీకొన్నాడు. దీంతో పెద్ద శబ్దం వచ్చింది. జనం నిద్రలేచి చూసి, పోలీసులకు సమాచారమిచ్చారు. కామాక్షిపాళ్య ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణ వచ్చి సచిన్ను ఆల్కోమీటర్తో పరీక్షించడానికి ప్రయత్నించగా అతడు తిరస్కరించి వాదులాటకు దిగాడు. స్టేషన్కు రావాలని కోరగా రానంటూ మొండికేశాడని పోలీసులు చెబుతున్నారు. మద్యం పరీక్షలు చేయాలని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా దౌర్జన్యంగా ప్రవర్తించాడని, ఎస్ఐ కృష్ణను దూషించి యూనిఫారంని చించేశాడని కేసు నమోదు చేశారు.


