శనివారం పింక్ లైన్‌లో వెళుతున్న రైలుబండి
మెట్రో రైలులో బాలలతో ముచ్చటిస్తున్న సీఎం డీకే శివకుమార్
బనశంకరి: ఉద్యాననగరిలో ప్రధాని మోదీచే ఆరంభమైన నమ్మ మెట్రో రైలు పింక్‌లైన్ మార్గంలో శనివారం నుంచి సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇందులో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10:50 గంటల వరకూ సర్వీసులు నడుస్తాయి. కాళేన అగ్రహార నుంచి చివరి రైలు రాత్రి 10:50 గంటలకు బయలుదేరుతుంది. పీక్ అవర్స్‌లో ప్రతి 8 నిమిషాలకు, నాన్ పీక్ అవర్స్‌లో ప్రతి 10 నిమిషాలకు ఒక రైలు సంచరిస్తుంది. శని, ఆదివారాల్లో 10 నిమిషాలకు ఒక రైలు నడుస్తుంది. దీనికి బిలేకహళ్లి–ఐఐఎంబీ అని పేరు ఖాయమైందని అధికారులు తెలిపారు. ఉదయం నుంచే నగరవాసులు, స్థానికులు ఈ సర్వీసుల్లో ప్రయాణానికి ఉత్సాహంగా తరలివచ్చారు.
నా టికెట్‌ను ప్రధానే కొన్నారు: సీఎం
శనివారం మధ్యాహ్నం సీఎం డీకే.శివకుమార్ కాళేన అగ్రహార నుంచి సుద్దగుంటెపాళ్య మెట్రోస్టేషన్ వరకు పింక్ మెట్రో రైలులో ప్రయాణించారు. కాళేన అగ్రహార మెట్రోస్టేషన్‌లో రైలు ఎక్కి యువత, బాలలతో సీఎం ఆప్యాయంగా మాట్లాడారు. శుక్రవారం నాటి ప్రయాణానికి ప్రధాని మోదీనే తన టికెట్ కూడా కొన్నారని సీఎం తెలిపారు. ఆ సమయంలో తన వద్ద డబ్బులు లేవని, నా టికెట్ కూడా తీసుకోమని ప్రధానికి చెప్పానన్నారు. ఆయనే స్వయంగా స్మార్ట్‌కార్డ్ తీసుకున్నారని కార్డును చూపించారు. కాగా, బాలల దినోత్సవం సందర్భంగా కిద్వాయ్ క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లి పలువురు బాలలను సీఎం పరామర్శించారు. మీరు కోలుకుంటారని భరోసా ఇచ్చారు. మంత్రి కృష్ణభైరేగౌడ కూడా రైలులో వచ్చారు.
17 నుంచి మహిళా ఎంపీల సమ్మేళనం
మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందాలని సీఎం డీకే అన్నారు. బెంగళూరులో ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే కామన్‌వెల్త్ మహిళా ఎంపీల సమ్మేళనం లోగోను విధానసౌధమెట్ల పై ఆయన ఆవిష్కరించారు. బీజేపీ ఎంపీ డీ.పురంధేశ్వరి నాయకత్వలో జరుగుతున్న సమ్మేళనం కర్ణాటక చరిత్రలో మైలురాయి లాంటిదని కొనియాడారు. దేశ విదేశాలకు చెందిన సుమారు 150 మందికి పైగా మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్పీకర్లు పాల్గొంటారని తెలిపారు.
ప్రయాణించిన సీఎం డీకే శివ
ప్రయాణికులతో సంభాషణ


