బాలున్ని మింగిన కెమికల్‌ బకెట్‌ | - | Sakshi
Sakshi News home page

బాలున్ని మింగిన కెమికల్‌ బకెట్‌

Nov 15 2026 1:14 PM | Updated on Nov 15 2026 1:14 PM

యశవంతపుర: ప్రమాదకర కెమికల్‌ నింపిన బకెట్‌లోకి పడి బాలుడు మరణించిన ఘటన బెంగళూరు శ్రీరామపురలో జరిగింది. సుబ్రమణి (2) అనే బాలుడు మృతుడు. ఈ విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుబ్రమణి కుటుంబం ఉండే ఇంటి పక్కన ఓ చిన్నపాటి కెమికల్‌ ఫ్యాక్టరీ ఉంది. చిన్నారి అక్కడ ఆటలాడుతూ అందులోకి వెళ్లాడు. కెమికల్స్‌ నింపిన బకెట్‌లోకి పడిపోయాడు. కొందరు బాలున్ని బయటకు తీసి దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే రసాయనాల విష ప్రభావం వల్ల బాలుడు చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి చనిపోయాడు. సంఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి.

సైబర్‌ మోసగత్తె..

రూ.2.98 లక్షల బురిడీ

శివమొగ్గ: సైబర్‌ మోసగాళ్లు రకరకాల వేషాల్లో అమాయకులకు బురిడీ వేస్తున్నారు. నగరంలో ఫ్లిప్‌కార్ట్‌ ఉద్యోగినిగా చెప్పుకొని ఒక మొబైల్‌ షాప్‌ ఉద్యోగిని లక్షల రూపాయలు మోసం చేసింది. వివరాలు.. మొబైల్‌ షాప్‌ సిబ్బందికి ఒక గుర్తు తెలియని మహిళ ఫోన్‌ చేసి, ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేసే సోనియాగా తెలిపింది. ప్రస్తుతం కర్ణాటక ప్రాంతానికి మేనేజర్‌ ఎవరూ లేరని, ఆర్డర్ల గురించి ఏవైనా సందేహాలుంటే తనను సంప్రదించమని చెప్పింది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఆ మహిళ మళ్లీ కాల్‌ చేసి, వాలెట్‌ ఖాతాలో ఆర్డర్లను తనిఖీ చేస్తాననే చెప్పడంతో సరే అన్నాడు. అతని నుంచి ఓటీపీని అందుకున్న వెంటనే అతని ఖాతా నుంచి రూ. 2,98,500 ను అక్రమంగా బదిలీ చేసుకుంది. దీంతో బాధితుడు లబోదిబోమంటూ శివమొగ్గలోని సిఈఎన్‌ ఠాణాలో ఫిర్యాదు చేయగా మోసగత్తె కోసం దర్యాప్తు చేపట్టారు.

16 నుంచి వ్యవసాయ మేళా

● బెంగళూరు జీకేవీకే ముస్తాబు

యశవంతపుర: ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజుల పాటు బెంగళూరు వ్యవసాయ వర్సిటీ (జీకెవీకె) ఆవరణలో వ్యవసాయ మేళా జరగనుంది. కృషి మేళా సన్నాహాలను వర్సిటీ అధికారులు చేపట్టారు. 10 ఎకరాలలో 75 వైవిధ్యమైన పంటలు, మొక్కల సాగు సిద్ధమైంది. మేళాలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కాగా మేళాకు పలు జిల్లాల నుంచి రైతులు, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపార సంస్థలు పాల్గొనే అవకాశముంది. పెద్దసంఖ్యలో స్టాళ్లు ఏర్పాటవుతున్నాయి.

మీలాగా స్టింగ్‌ వీడియోలు చేయలేదు: కుమార

తుమకూరు: రాష్ట్రంలోని రైతులను ఆదుకోవడంలో సీఎం డీకే శివకుమార్‌ విఫలమయ్యారని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. ఆయన శనివారం జిల్లాలోని గుబ్బి తాలూకా సీఎస్‌పురలో నూతనంగా నిర్మించిన సముదాయ భవనం, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కాంస్య ప్రతిమను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో కరువు రైతులకు అనుకూలమయ్యే పథకాలను రూపొందించి, బాధ్యతాయుతమైన పాలన సాగించాల్సిన సీఎం కేవలం పోస్టర్‌ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కుమారస్వామికి కడుపుమంట అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ తాను సీఎం పదవిని ఎరగనివాడిని కాదు, రెండుసార్లు ముఖ్యమంత్రినైనట్లు చెప్పారు. ఆయనలా స్టింగ్‌ వీడియోలను చేస్తూ కూర్చోలేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement