రైతులు కష్టాల్లో ఉంటే.. సంబరాలా? | - | Sakshi
Sakshi News home page

రైతులు కష్టాల్లో ఉంటే.. సంబరాలా?

Oct 2 2026 1:22 AM | Updated on Oct 2 2026 1:22 AM

మైసూరు: పలు డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గురువారం నగరంలో రైతు సంఘం, రైతు మహా సమాఖ్యల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నగరంలోని చాముండి గెస్ట్‌హౌస్‌ గుండా ఊరేగింపుగా సాగిన ఆందోళనకారులు జిల్లాధికారి కార్యాలయానికి చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు నేత ఇంగలగుప్పె కృష్ణేగౌడ మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్ర కరువు నెలకొందని, లక్షలాది రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన పంటలు పొలంలోనే ఎండిపోయాయన్నారు. తీవ్ర కరువు ఉన్నా మైసూరు దసరా, కంబళ, కావేరి హారతి వంటి వేడుకలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసే ముఖ్యమంత్రి రైతులకు మాత్రం రూ.2500 చొప్పున భిక్షం పరిహారం వేసి చేతులు దులుపుకుంటుండటం సిగ్గుచేటని అన్నారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం మెట్ట భూములకు ఎకరాకు రూ.25 వేలు, మాగాణి భూములకు ఎకరాకు రూ.50 వేల చొప్పున కరువు సహాయం ప్రకటించాలని, రైతులందరి రుణాలను మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు.

రక్తదాతలకు సన్మానం

మైసూరు: జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మైసూరు, జిల్లా ఎయిడ్స్‌ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో ఎంఎఎకె– ఎస్‌.డి.ఎం మహిళా కళాశాలలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా 40 మంది విద్యార్థినులు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. వైద్యాధికారిణి బృందా.బి మాట్లాడుతూ, ఆరోగ్యంగా ఉన్న యువతులు ఎలాంటి భయం లేకుండా రక్తదానం చేయవచ్చని అన్నారు. ఈ సందర్భంగా రక్తదాతలను సత్కరించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి అనితా జయరామ్‌, అధ్యాపకులు కుసుమ, గిరీష్‌, భారతి, కె.ఎస్‌.సుక్రిత్‌ పాల్గొన్నారు.

మంగళూరు రైల్వే..

మైసూరులోకి విలీనం

యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా ప్రజలు, రైలు ప్రయాణికుల బహుకాలపు కల నిజమైంది. దక్షిణ రైల్వే పాలక్కాడ్‌ విభాగంలో కొనసాగుతున్న మంగళూరు రైల్వే డివిజన్‌ను నైరుతీ రైల్వే మైసూరు విభాగంలోకి బదిలీ చేశారు. అక్టోబర్‌ 1 అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చినట్లు మైసూరు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మార్పు నేపథ్యంలో ప్రయాణికులకు, రైలు సేవలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అధికారులు రైల్వే సిబ్బందితో చర్చించారు. దీనివల్ల ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని రైల్వే పీఆర్‌ఓ గిరీష్‌ ధర్మరాజ కలగొండ తెలిపారు.

మత్తు టీ ఇచ్చి మహిళకు బురిడీ

● డబ్బు, గొలుసు తస్కరణ

దొడ్డబళ్లాపురం: బస్టాండులో బస్‌ కోసం వేచి చూస్తున్న మహిళతో మంచిగా మాట్లాడి టీ ఇప్పించిన దొంగ బ్యాగ్‌ కొట్టేసి పరారయ్యాడు. ఈ సంఘటన బెంగళూరు బ్యాటరాయనపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. దొడ్డబళ్లాపురం తాలూకా నివాసి చన్నమ్మ, మైసూరుకు వెళ్లేందుకు శాటిలైట్‌ బస్టాండులో వేచి ఉంది. దొంగ ఆమెతో మాటలు కలిపి టీస్టాల్‌కు తీసుకెళ్లి టీ తాగారు. చన్నమ్మ కాసేపటికే నిద్రలోకి జారింది. కొంతసేపటికి చన్నమ్మకు మెలకువ వచ్చి చూడగా తన బ్యాగ్‌ కనబడలేదు. బ్యాగులో కాస్త నగదు, బంగారు గొలుసు ఉన్నట్టు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement