క్రీడల్లో గెలుపోటములు సహజం | - | Sakshi
Sakshi News home page

క్రీడల్లో గెలుపోటములు సహజం

Sep 28 2026 12:59 AM | Updated on Sep 28 2026 12:59 AM

రాయచూరు రూరల్‌: క్రీడల్లో గెలుపోటములు సహజం. క్రీడాకారులు గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని జిల్లా అధికారి పూవిత అభిప్రాయపడ్డారు. ఆదివారం జిల్లా పోలీస్‌ క్రీడా మైదానంలో రాయచూర్‌ రిపోర్టర్స్‌ గిల్డ్‌ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రీడలతో మానసికోల్లాసం లభిస్తుందని తెలిపారు. ఒత్తిడి నుంచి బయట పడేందుకు తరచుగా క్రీడల్లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్పీ అరుణాంగ్శు గిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌ కాందూ, నగర పాలికె కమిషనర్‌ జుబీన్‌ మోహపాత్రో, క్రీడా యువజన సేవాధికారి వీరేష్‌ నాయక్‌, గురునాథ్‌, విజయ్‌ జాగటగల్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రాలయంలో భక్తుల సందడి

రాయచూరు రూరల్‌: మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఆరాధనోత్సవాలు, సప్త రాత్రోత్సవాలు, చాతుర్మాస ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ముగిశాయి. ఉదయం నుంచే మఠంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఉత్సవాల ముగింపు సందర్భంగా రాఘవేంద్ర స్వామి మూల విరాట్‌కు వేద మంత్రోచ్ఛారణల నడుమ ఊంజల (ఉయ్యాల) సేవను నిర్వహించారు. మఠం పీఠాదిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్‌ సమక్షంలో మంగళ వాయిద్యాలు, మేళతాళాలు నడుమ భజనలు, కీర్తనలు ఆలపించడంతో మఠం ప్రాంగణం మార్మోగింది. అనంతరం, మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులకు భక్తులు తులాభారం వేసి, మొక్కులు చెల్లించుకున్నారు.

రైతులకు

పరిహారం అందించరా?

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలోని ఉత్తర, కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో భీకరమైన కరువు సంభవించింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు పరిహారం అందించాలి. వెంటనే కరువు సహాయక పనులు ప్రారంభించాలని మాన్వి మాజీ శాసనసభ సభ్యుడు రాజా వెంకటప్ప నాయక్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం సిరవారలోని బసవేశ్వర సర్కిల్‌ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఎడ్ల బండ్లపై తరలివచ్చి రైతులు, నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాజా వెంకటప్ప నాయక్‌ మాట్లాడుతూ.. కరువు పరిస్థితుల్లో రైతులు, సామాన్య ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే ఇక్కడి ప్రజాప్రతినిధులు మౌనం వహించడం తగదన్నారు. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందడం లేదని మండిపడ్డారు. గేజ్‌ నిర్వహణలో జరుగుతున్న లోపాలను అధికారులు తక్షణమే సవరించాలన్నారు. కరువుతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25,000 చొప్పున పరిహారం చెల్లించాలని కోరారు. అనంతరం వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక అధికారికి వినతిపత్రం సమర్పించారు.

కనీస వేతనాలు ఇవ్వాల్సిందే..

రాయచూరు రూరల్‌: వివిధ శాఖలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనాలు అందించాలని ఏఐటీయూసీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు శరణ బసవ మాట్లాడుతూ.. తక్కువ జీతాలతో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కనీస వేతనాలు అందించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెలిపారు. సౌకర్యాలు కల్పించాలని కోరతూ తహసీల్దార్‌ సురేష్‌ వర్మకు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement