సాక్షి, బళ్లారి: నకిలీ పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయల విలువైన భూమిని అక్రమంగా విక్రయించిన ఉదంతం బళ్లారిలో వెలుగుచూసింది. శుక్రవారం బళ్లారిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని బాధితులు ముట్టడించారు. కార్యాలయ సిబ్బంది అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోకి ప్రవేశించారు. బళ్లారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అవినీతి కూపంగా మారిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. కనీసం భూమి ఎవరి పేరుతో ఉందో కూడా వెరిఫికేషన్ చేయకుండా లంచాలకు ఆశపడి నకిలీ పత్రాలతో భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారంటూ సబ్ రిజిస్ట్రార్ దేవప్ప, ఇతర కార్యాలయ అధికారులను నిలదీశారు. ఈ వ్యవహారంపై అధికారి మూబున్నిసా బేగంతో చర్చించారు. కోట్లాది రూపాయల ఆస్తిని నకిలీ వ్యక్తులతో ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ఆగ్రహించారు. నకిలీ దాఖలాలతో రిజిస్ట్రేషన్ చేసే దేవప్పపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై జిల్లా ఎస్పీ సుమన్ పన్నేకర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనంతరం బుడా అధ్యక్షుడు జే.ఎస్.ఆంజనేయులు, బాధితుడు నారాయణప్ప విలేకరులతో మాట్లాడారు. నకిలీ వ్యక్తులతో రిజిస్ట్రేషన్లు చేయడంపై ప్రశ్నిస్తే కోర్టుకు వెళ్లాలని అధికారులు చెబుతున్నారన్నారు. సబ్ రిజిస్ట్రార్ అనుమతితోనే నకిలీ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. డబ్బు తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోయపాటి విష్ణు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ రిజిస్ట్రేషన్ ఎలా చేశారు?
బళ్లారి నగరంలోని గాంధీ నగర్‌కు చెందిన నారాయణప్ప కొంత కాలంగా బెంగళూరు నివాసం ఉంటున్నాడు. 2003 సంవత్సరంలో నారాయణప్ప తన కుమార్తె స్వప్న పేరుపై కొళగళ్లు గ్రామ సమీపంలో సర్వే నంబర్ 619–2లో 6.87 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే స్వప్ప బెంగళూరులో నివాసం ఉండటంతో సదరు భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. సబ్ రిజిస్ట్రార్ సహకారంతో వేరే మహిళను తీసుకొచ్చి స్వప్నగా నమ్మించారు. ఆమె పేరుతో ఆధార్‌కార్డు కూడా సృష్టించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది సహకారం అందించడంతో దాదాపు రూ.5 కోట్ల విలువైన భూమిని ఈ ఏడాది జూన్ 9వ తేదీన లోకేష్ అనే వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. నెల రోజుల తరువాత లోకేష్ కూడా ఇదే భూమిని కొళగల్లు గ్రామానికి ఉమేష్ అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయించాడు. సాధారణంగా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పాణి రావాలంటే అన్ని విధాలుగా రికార్డులు సరిచేసేందుకు నెల రోజులు పడుతుంది. నిబంధనలను తుంగలోకి తొక్కి ఆస్తిని చకచకా రిజిస్ట్రేషన్ చేసేశారు. ఈ అక్రమాల పుట్ట బయటకు రావడంతో బాధితులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టిండించి నిలదీశారు. ఇదే కాకుండా హనుమంతరావు అనే వ్యక్తికి చెందిన భూమిని కూడా నకిలీ దాఖలాలు సృష్టించి వేరే వ్యక్తుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేశారు.
బళ్లారిలో సబ్ రిజిస్ట్రార్
కార్యాలయాన్ని ముట్టడించిన
బాధితులు
సబ్ రిజిస్ట్రార్ దేవప్పపై
చర్యలు తీసుకోవాలని డిమాండ్


