పథకాలు సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

పథకాలు సద్వినియోగం చేసుకోండి

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

రాయచూరు రూరల్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని రాయచూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిద్ధరామప్ప పిలుపునిచ్చారు. శుక్రవారం రాయచూరు తాలూకా పరిధిలోని మటమారి గ్రామంలో జాతీయ, రాష్ట్ర న్యాయ సేవా ప్రాధికార ఆధ్వర్యంలో 171 మందికి ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు, 36 మందికి వృద్ధాప్య పింఛన్లు, 61 మందికి వితంతు పింఛన్లు, 38 మందికి కార్మిక కార్డులు, 38 మందికి వాహన లైసెన్సులు పంపిణీ చేశారు. న్యాయ సేవా అధికార సంస్థ కేవలం చట్టాలపై అవగాహన కల్పించడమే కాకుండా, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా నిర్దేశిస్తుందని తెలిపారు.

పంట నష్టపరిహారం

అందించాలి

రాయచూరు రూరల్‌: ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో కురిసిన వర్షాలకు రైతులు సాగు చేసిన పంటలకు ప్రభుత్వం తక్షణమే పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మాన్వి మాజీ శాసన సభ్యుడు రాజా వెంకటప్ప నాయక్‌ డిమాండ్‌ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మాన్విలోని అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, కరువు పీడిత ప్రాంతాలను సకాలంలో గుర్తించడంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తొలకరి వానలను నమ్ముకుని వేసిన పంటలు ఎండుముఖం పట్టాయని తెలిపారు. వాణిజ్య బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలను రద్దు చేయాలని కోరారు.

రైతుల సమస్యలు పట్టవా?

రాయచూరు రూరల్‌: ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో అత్యంత భీకరమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయి. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే కరువు పరిహారం అందించి ఆదుకోవాలని కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు చామరస మాలి పాటిల్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు, ప్రజలు వర్షాలు లేక, పంటలు పండక కరువు పరిస్థితి నెలకొని కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు మౌనం వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తుంగభద్ర ఎడమ కాలువ పరిధిలోని చివరి ఆయుకట్టు భూములకు నీరందడం లేదన్నారు. గేజ్‌ నిర్వహణలో లోపాలు సవరించాలని కోరారు. పరిహారం కింద ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

హెస్కాం ఎండీగా హేమంత్‌

హుబ్లీ: హెస్కాం (హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లయ్‌ కంపెనీ లిమిటెడ్‌) నూతన మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఐఏఎస్‌ అధికారి ఎన్‌.హేమంత్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన 2020 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. అంతకుముందు శివమొగ్గ జిల్లా జెడ్పీ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించారు.

కళలతో నైపుణ్యాల వెలికితీత

రాయచూరు రూరల్‌: సమాజంలో విద్యార్థుల అంతర్గత ప్రతిభ, నైపుణ్యాలు వెలికి తీయడానికి సాంస్కృతిక కళలు దోహదపడతాయని కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పండిత సిద్ధరామ జంబలదిన్ని రంగమందిరంలో జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.స్వామీజీ మాట్లాడుతూ..విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. సర్కారీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, రాజా శ్రీనివాస్‌, డీడీపీయూ అధికారి సోమశేఖరప్ప, సుదామ, రవి, పద్మరాజ్‌, నరసప్ప, కుంటెప్ప, గౌరీష్‌, రంగముని దాస్‌, బసవరాజ్‌ పాల్గొన్నారు.

ట్యాంకర్లతో నీటి సరఫరా

రాయచూరు రూరల్‌: నగరంలోని 18వ వార్డు ప్రజలకు నగర సభ మాజీ అధ్యక్షురాలు లలిత ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేయించారు. రెండు రోజులుగా వార్డులో విద్యుత్‌ సమస్య తలెత్తింది. తాగునీటి సమస్య నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఆర్‌డీఏ మాజీ అధ్యక్షుడు ఆంజనేయ విద్యుత్‌ లైన్‌కు మరమ్మతు చేయించారు. నగర సభ మాజీ అధ్యక్షురాలు లలిత ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేయించి ప్రజల దాహార్తి తీర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement