పాత బస్సులు.. తప్పని తిప్పలు | - | Sakshi
Sakshi News home page

పాత బస్సులు.. తప్పని తిప్పలు

Sep 26 2026 12:20 AM | Updated on Sep 26 2026 12:20 AM

సాక్షి, బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేఎస్‌ఆర్‌టీసీ సంస్థ తీరు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు, అస్తవ్యస్తంగా నడుస్తున్న కేఎస్‌ఆర్‌టీసీ సంస్థలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంభారంగా మారింది. ప్రభుత్వం నుంచి వందల కోట్ల రూపాయలు సంస్థకు బకాయిలు ఉండటంతో కొత్త బస్సులు కొనుగోలు చేయడానికి ఆర్థిక సమస్యలు, వెంటాడుతున్నాయి. బస్సులను సక్రమంగా నిర్వహణ చేయలేక పాత బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

బస్సు డ్రైవర్ల అవస్థలు వర్ణనాతీతం..

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసిన తర్వాత బస్సుల్లో కిక్కిరిసి జనం వెళుతున్నారు. అయితే వాటి సక్రమ నిర్వహణపై శ్రద్ధ చూపకపోవడంతో పాత బస్సులను నడపలేక డ్రైవర్లు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ఇటీవల కొప్పళ జిల్లా నుంచి బయలు దేరిన కేఎస్‌ఆర్‌టీసీ బస్సు పని తీరు చూసి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొప్పళ–శహాపూర్‌ మధ్య తిరుగుతున్న ఆర్‌టీసీ బస్సుకు హెడ్‌లైట్లు ఫెయిల్‌ కావడంతో డ్రైవర్‌ తన చేతిలోని మొబైల్‌ ఫోన్‌లోని టార్చిలైట్‌ను ఆన్‌ చేసుకుని బస్సు నడిపాడు. జడివాన అందులో హెడ్‌లైట్లు పని చేయకపోవడంతో దారి మధ్యలో ఏం చేయాలో అర్థం కాక డ్రైవర్‌ నిదానంగా బస్సును ముందుకు తీసుకెళ్లారు. కారు మబ్బులు, జడివానలో రోడ్డు కనిపించకపోవడంతో ప్రమాదం జరిగితే తమ పరిస్థితి ఏమిటని ప్రయాణికులు ప్రశ్నించారు.

20 శాతం పాత బస్సులే..

ఇలా ఒక్క కొప్పళ–శహాపూర్‌ మధ్య తిరిగిన బస్సులో చోటు చేసుకున్న సంఘటనే కాదు. ఉత్తర కర్ణాటక పరిధిలోనే కాకుండా రాష్ట్రంలో కేఎస్‌ఆర్‌టీసీ బస్సులు అధ్వానంగా ఉన్నప్పటికీ, పాత బస్సులనే నడపడంతో ప్రమాదాలకు హేతువుగా మారుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. నిత్యం రద్దీగా తిరిగే కేఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో నూటికి 20 శాతం పైగా పాతబడి పోయాయని, వాటి నిర్వహణ కూడా సరిగా చూడటం లేదని సంస్థలో పని చేసే ఉద్యోగులు పేర్కొనడం గమనార్హం. ఏదేమైనా ఇలాంటి పాత బస్సులను గుర్తించి వాటికి తగిన మరమ్మతులు చేసైనా నడపాలి లేదా కొత్త బస్సులను మరిన్ని కొని ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మార్గమధ్యంలోనే మొరాయిస్తున్న ఆర్టీసీ బస్సులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement