బనశంకరి: మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పౌరకార్మికుల సంక్షేమానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ తెలిపారు. శుక్రవారం ప్యాలెస్ మైదానంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి పౌర కార్మికుల దినోత్సవాన్ని సీఎం ప్రారంభించి మాట్లాడారు. సాంఘిక సంక్షేమ శాఖ, నగరాభివృద్ధి శాఖ నిపుణులను ఉపకమిటీలో నియమిస్తామన్నారు. పౌరకార్మికులకు నిత్యం ఉపహార వేతనాన్ని రూ.35 నుంచి రూ.70లకు పెంచుతామన్నారు. కార్మికుల పిల్లలకు ప్రత్యేక వసతి పాఠశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. పౌరభవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పౌరకార్మిక వాహన డ్రైవర్లకు సౌకర్యాలు కల్పించే దృష్టితో వచ్చేవారం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. కార్మికులు లేకపోతే స్వచ్ఛత ఉండదన్నారు. పౌరకార్మికులు స్వచ్ఛత రాయబారులు, మీ చేతులు కరునాడును కాపాడే చేతులన్నారు. మంత్రులు హెచ్‌సీ.బాలకృష్ణ, బసవంతప్ప, డాక్టర్ యతీంద్రసిద్దరామయ్య, కేహెచ్.మునియప్ప, సఫాయి కర్మచారి అభివృద్ధి కమిషన్ అధ్యక్షుడు పీ.రఘు, మాజీమంత్రి ఆంజనేయ, మాజీ ఎంపీ ఎల్‌ఆర్.శివరామేగౌడ, మాజీ ఎమ్మెల్యే వెంకట రమణయ్య, సఫాయి కర్మచారి అభివృద్ధి మండలి అధ్యక్షుడు అశోక్ సాలప్ప, మున్సిపల్ శాఖ కార్యదర్శి బీబీ.కావేరి, డైరెక్టర్ రవీంద్ర, పౌరకార్మికుల అభివృద్ధి సంఘం అధ్యక్షురాలు శైలా, ప్రభాకర్, నారాయణ పాల్గొన్నారు.


