బనశంకరి: భార్యను గొంతు నులిమి చంపి మృతదేహాన్ని ఇంట్లో మూడురోజులపాటు దాచిపెట్టిన అనంతరం పరుపులో చుట్టి ఖాళీ స్థలంలో పడేసిన భర్త ఉదంతం బెంగళూరులో వెలుగు చూసింది. ఒడిశాకు చెందిన అనసూయ(28), సాగర్‌చంద్ర రావత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరూ బెంగళూరుకు వలస వచ్చి హోటళ్లలో పనిచేసేవారు. సంపిగెహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉండేవారు. ఈనెల 11న డబ్బు విషయంలో దంపతుల మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన సాగర్ అనసూయను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మూడు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లో ఉంచాడు. తర్వాత పరుపులో చుట్టి సంపిగెహళ్లి ఎంఎస్.నగర అగ్రహార లేఔట్‌లోని ఖాళీ స్థలంలో పడేసి అక్కడి నుంచి ఉడాయించాడు. ఖాళీ స్థలాన్ని కార్మికులు శుభ్రం చేస్తుండగా కుళ్లిన స్థితిలో కుక్కలు పీక్కుతిన్న గుర్తుతెలియని మహిళ శవం లభ్యమైంది. సంపిగెహళ్లి పోలీసులు వచ్చి పరిశీలించారు. మృతదేహంపై ఉన్న దుస్తులను పరిశీలించగా మాల్‌ట్యాగ్ లభించింది. దాని ఆధారంగా బిల్లు వివరాలను సేకరించి మృతురాలిని అనుసూయగా గుర్తించారు. గాలింపు చేపట్టి భర్త సాగర్‌చంద్ర రావత్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా తానే అంతమొందించినట్లు అంగీకరించాడు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడిని పట్టించిన మాల్ ట్యాగ్


