రాయచూరు రూరల్: పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మస్కి తాలుకా పంచాయితీ అధికారి అమరేష్ సూచించారు. శుక్రవారం మస్కి తాలూకా కోల్‌బాల్‌లో జీవన జ్యోతి పథకంలో భాగంగా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం అని పేర్కొన్నారు. బ్యాకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తే మరింత మందికి రుణాలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో పీడీఓ సందేశ్, శరణయ్య, బసవరాజ, రమేష్, ప్రకాష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్ కేటుగాళ్ల వంచన
హుబ్లీ: స్టాక్స్‌లో డబ్బు పెట్టుబడి పెడితే ఎక్కువ సంపాదించవచ్చని నమ్మించి స్థానిక గోకుల్ రోడ్డు మురుగేష్ అనే వ్యక్తి ఖాతా నుంచి రూ.4.86 లక్షలను బదలాయించుకుని ఆన్‌లైన్ కేటుగాళ్లు వంచించారు. వివరాలు.. మురుగేష్‌కు సంజన అనే గుర్తు తెలియని మహిళ ఫోన్ చేసింది. స్టాక్ మార్కెట్‌లో డబ్బు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించింది. ఆమె మాటలు నమ్మిన మురుగేష్.. వారు పంపిన లింక్‌ను డౌన్‌లోడ్ చేశాడు. లాగిన్ అయ్యాక దశల వారీగా రూ.4.86 లక్షలను ఆన్‌లైన్ వంచకులు తమ ఖాతాలోకి బదలాయించుకున్నారు. అనంతరం వారి ఫోన్ పని చేయకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన మురుగేష్ నగరంలోని గోకుల్ రోడ్డు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సీనియర్ సిటిజన్లను
గౌరవించడం అందరి బాధ్యత
బళ్లారి టౌన్: సీనియర్ సిటిజన్లను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సివిల్ న్యాయమూర్తి రాజేష్ హొసమని సూచించారు. ప్రపంచ సీనియర్ సిటిజన్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని హిరియ నాగరికర సబలీకరణ శాఖ ఆధ్వర్యంలో బీఎంసీఆర్‌సీ మైదానంలో క్రీడా పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా శిశు అభివృద్ధి శాఖ డీడీ రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ.. సీనియర్ల కోసం న్యాయ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. న్యాయ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. అంతకుముందు నిర్వహించిన నడక, మ్యూజికల్ చైర్, బకెట్లోకి బాల్ వేయడం తదితర పోటీల్లో వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని అలరించారు. కార్యక్రమంలో అధికారులు గోవిందప్ప, గురుమూర్తి, వెంకమ్మ, విరుపాక్షయ్య, విఠర్ లుంగి, ప్రజ్ఞ, చిన్నబాలయ్య, వెంకోబప్ప, మనిరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాల్సిందే
రాయచూరు రూరల్: దేశ వ్యాప్తంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఓట్లను తొలగిస్తున్నారని సీపీఐఎంఎల్ నాయకులు ఆరోపించారు. శుక్రవారం టిప్పు సుల్తాన్ ఉద్యానవనంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సంచాకుడు అజీజ్ జాగీర్దార్ మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సర్ ప్రక్రియలో లోపాలు బయట పడుతున్నాయని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టను దిగజార్చారని మండిపడ్డారు. దేశంలో ఐదు కోట్ల మంది పేర్లు తొలగించడంతో కోర్టు మెట్లు ఎక్కారని తెలిపారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా చాలా ఓట్లు తొలగించారని ఆరోపించారు.


