హొసపేటె: ప్రాథమిక సౌకర్యాలు, తగిన ప్రోత్సాహకాలు కల్పించకుండా సమస్త యాప్‌ను తప్పనిసరి చేయడంపై ఆశా కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐయూటీయూసీ అనుబంధ కర్ణాటక రాష్ట్ర యునైటెడ్ ఆశా వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం విజయనగర జిల్లా డీహెచ్‌ఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి గౌరమ్మ మాట్లాడుతూ.. ఆరోగ్య శాఖ నుంచి నాణ్యమైన మొబైల్ ఫోన్లు, ట్యాబ్‌లు అందించలేదని తెలిపారు. ఆశా కార్యకర్తలు సొంత మొబైళ్లను ఉపయోగించాల్సి వస్తోందన్నారు. గతంలో అందించిన నెలకు రూ.280 మొబైల్ చార్జీలను నిలిపి వేశారని గుర్తు చేశారు. ఆశా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం జిల్లా ఆరోగ్య శాఖ అధికారి లింగారాజుకు వినతిపత్రం అందజేశారు.


