హొసపేటె: సమాచార హక్కు చట్టంతో పారదర్శక పాలన సాధ్యం అవుతుందని జిల్లా కలెక్టర్ కవిత ఎస్.మన్నికేరి అన్నారు. శుక్రవారం నగరంలోని జిల్లా పంచాయతీ హాలులో సమాచార హక్కు చట్టంపై వర్క్‌షాప్, సంభాషణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాచార హక్కు చట్టం అనేది పరిపాలన వ్యవస్థలో పారదర్శకతను తీసుకువచ్చే చట్టపరమైన సాధనం అని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు పక్కాగా అమలు అవుతున్నాయో లేదో ప్రజలు తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. అధికారులు ఈ చట్టంలోని నిబంధనలపై అవగాహన పెంచుకుని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. దరఖాస్తుదారు సమాచారాన్ని కోరితే, నిర్దేశించిన సమయంలోపు సమాచారం అందించాలని ఆదేశించారు. సమాచార హక్కు చట్టాన్ని కేవలం దరఖాస్తుదారుడి హక్కుగా మాత్రమే కాకుండా.. పారదర్శకత, ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని పెంపొందించే యంత్రాంగంగా చూడాలని పేర్కొన్నారు. చట్టానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విశ్రాంత సంయుక్త సంచాలకుడు వెంకటరమణప్ప, జిల్లా పంచాయత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గరిమా పన్వార్, అదనపు జిల్లా కలెక్టర్ పీఎన్.లోకేష్ పాల్గొన్నారు.


