34 రోజుల్లో రూ.2.21 కోట్ల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

34 రోజుల్లో రూ.2.21 కోట్ల ఆదాయం

Sep 25 2026 2:23 AM | Updated on Sep 25 2026 2:23 AM

మైసూరు: చామరాజనగర జిల్లా, హనూరు తాలూకాలోని సుప్రసిద్ధ దేవస్థానం మలె మహదేశ్వర బెట్టలో మాదప్పపై కనకవర్షం కురుస్తోంది. గత కొన్నేళ్లుగా హుండీ ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది. తాజాగా గత 34 రోజులకుగాను హుండీలను గురువారం లెక్కించగా, రూ.2.21 కోట్ల ఆదాయం లభ్యమైంది. బెట్టలోని బస్టాండు సమీపంలోని వాణిజ్య సముదాయంలో సాలూరు శ్రీ శాంత మల్లికార్జున స్వామిజీ, ఆలయ అథారిటీ కార్యదర్శి పురుషోత్తం సమక్షంలో ఆలయ హుండీలను తెరిచారు. గౌరీ–గణేశ పండుగ సెలవులు, అమావాస్య జాతర మహోత్సవం నేపథ్యంలో పెద్దసంఖ్యలో భక్తులు మాదప్పను దర్శించుకుని కానుకలు సమర్పించారు.

నగదుతో పాటు 68 గ్రాముల బంగారం, 2 కేజీల వెండి సొత్తు లభించింది. చెలామణిలో లేని రూ. 2 వేల నోట్లు 2 నోట్లు, 21 దేశాల విదేశీ నోట్లు కూడా లభ్యమయ్యాయి.

28 నుంచి ప్రదూష్‌ విచారణ

● దర్శన్‌కు ఎదురుగాలి

యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, నటుడు దర్శన్‌కు మరిన్ని కష్టాలు చుట్టుముట్టాయి. అప్రూవర్‌గా మారిన 14వ నిందితుడు ప్రదూష్‌ను ఈ నెల 28 నుంచి సాక్షిగా విచారించాలని కోర్టు నిర్ణయించింది. ప్రదూష్‌ అప్రూవర్‌గా మారటానికీ వీల్లేదంటూ దర్శన్‌ దంపతులు హైకోర్టులో కేసులు వేసినా చెల్లలేదు. ట్రయల్‌ కోర్టు అయిన బెంగళూరు 59వ సెషన్స్‌ న్యాయాలయం ప్రదూష్‌ విచారణకు ఉత్తర్వులిచ్చింది.

సుప్రీంకోర్టుకు వెళ్తామని చెబితే..

దీంతో ఇక సుప్రీంకోర్టుకే వెళ్లాలని దర్శన్‌ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన వకీళ్లు సెషన్స్‌ కోర్టు జడ్జికి తెలిపారు. కాబట్టి అంతవరకూ ప్రదూష్‌ విచారణను వాయిదా వేయాలని మనవి చేశారు. అయినప్పటికీ జడ్జి ఈ వినతుల్ని తిరస్కరించి 28 నుంచి అప్రూవర్‌గా విచారించాలని తెలిపారు.

ముందస్తు బెయిలుకు

శాంత అర్జీ

బనశంకరి: కేపీఎస్‌సీ పశువైద్యాధికారుల నియామకాల కుంభకోణంలో ముందస్తు బెయిల్‌ కోసం ఆ సంస్థ సభ్యురాలు శాంతా హొసమని హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇటీవల ఆమె ముందస్తు బెయిల్‌ అర్జీని నగర 52వ సీసీహెచ్‌కోర్టు తిరస్కరించింది. దీంతో మళ్లీ హైకోర్టు మెట్లెక్కారు.

భారీ అక్రమాల శాంత

కేపీఎస్‌సీలో జరిగిన పలు అక్రమాల్లో శాంతా హొసమని సూత్రధారిగా ఉన్నారని సీఐడీ అధికారులు పలు సాక్ష్యాలను సేకరించారు. 384 పోస్టుల భర్తీలో ఆమె అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఆమె సహాయంతో కలబుర్గి, బీదర్‌, యాదగిరి జిల్లాల్లో 10 మంది అభ్యర్థులు కేఏఎస్‌కు ఎంపికై నట్లు సీఐడీకి సమాచారం అందింది. దీంతో శాంతతో పాటు ఇప్పుడు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్న అనేకమందిలో గుబులు నెలకొంది.

విద్యార్థులపై ఫీజుల బండ

● పీయూసీలో 50 శాతం పెంపు

శివాజీనగర: ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఫీజులను పెంచిన ప్రభుత్వం వెంటనే, పీయూసీ (ఇంటర్‌) ఫీజులను కూడా అనూహ్యంగా హెచ్చించింది. పరీక్ష ఫీజులతో సహా మొత్తం 26 రకాల సేవల రుసుములను 50 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమలులోకి వచ్చాయి.

8 ఏళ్లుగా పెంచలేదు..

దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ, గత 8 ఏళ్లుగా పీయూసీ కోర్సుల్లో ఫీజుల పెంపు లేదు. అందువల్ల ఫీజుల సవరణ అనివార్యమని అన్నారు. ముద్రణ సామగ్రి ధరలు, పరీక్షల నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఫీజులను ఆకస్మాత్తుగా 50 శాతం పెంచడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులపై ఆర్థిక భారం మరింత పెరుగుతుందని పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement