శివాజీనగర: మరో 15 రోజుల పాటు ప్రతిరోజూ 4,000 క్యూసెక్కుల కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని సీడబ్ల్యూఆర్‌సీ కర్ణాటకకు ఆదేశించడం ద్వారా పెద్ద షాక్ ఇచ్చింది. కరువుతో కన్నడనాడు అల్లాడిపోతున్న సమయంలో కావేరి కమిటీల ఆదేశాలు గోరుచుట్టు మీద రోకటి పోటులా మారాయనే ఆందోళన నెలకొంది.
ఢిల్లీలో ఫలించని వాదనలు
కావేరీ జలాల పంపిణీపై గురువారం ఢిల్లీలో సీడబ్ల్యూఆర్‌సీ సమావేశం జరిగింది. కర్ణాటక నుంచి కావేరీ జల కార్పొరేషన్ ఎండీ మహేష్, తమిళనాడు నుంచి జలవనరుల అధికారులు పాల్గొన్నారు. తీవ్ర కరువుతో ఉన్నాం, ఇంతటి దుర్భర పరిస్థితిలో తమిళనాడుకు నీటిని విడుదల చేయలేమని కర్ణాటక అధికారులు తెలిపారు. కానీ తమ వాటా నీరు కావాలని తమిళనాడు అధికారులు పట్టుబట్టారు. కావేరి కమిటీ తమిళనాడు వైపు మొగ్గుచూపుతూ పై ఆదేశం జారీ చేసింది.
సుప్రీంకోర్టులో విచారణ
తమిళనాడుకు భారీగా కావేరి జలాలను విడుదల చేయాలన్న కావేరి అథారిటీ సిఫార్సులను సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం విచారణ జరిగింది. న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహ్రాలు విచారించారు. కర్ణాటక న్యాయవాది శ్యామ్ దివాన్ వాదిస్తూ రాష్ట్రం కరువును ఎదుర్కొంటోందని, సీడబ్ల్యూఎంఏ ఆదేశాల మేరకు నీటిని విడుదల చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతోందని తెలిపారు. డ్యాముల్లో నీటి లభ్యత, వర్షాల కొరత తదితరాలను పరిగణించాలన్నారు. నీరు లేకపోయినప్పటికీ నీటి విడుదల ఆదేశాలను పాటిస్తున్నట్లు తెలిపారు. రుతుపవనాలు తిరుగుముఖం పట్టాయని, వర్షాలు కురిసే అవకాశం లేదని తెలిపారు. కానీ తమిళనాడు ఈశాన్య రుతుపవనాల వల్ల ప్రయోజనం పొందే అవకాశముందని చెప్పారు.
తమిళనాడు ప్లీడరు వాదిస్తూ తమ రాష్ట్రం 20 టీఎంసీల నీటి కొరతను ఎదుర్కొంటోందన్నారు. కావేరి కమిటీలు ఆదేశించినా ఈ లోటును భర్తీ చేయలేదని కర్ణాటకపై నెపం నెట్టారు. తమ పంటలు దెబ్బతిన్నాయని, మిగిలిన నీటిని కూడా విడుదల చేయాలని కోరుతూ గణాంక సమాచారాన్ని వివరించారు.
ఇరు రాష్ట్రాల వాదనలు విన్న తరువాత జడ్జిలు.. తమిళనాడు పిటిషన్‌పై స్పందన దాఖలు చేయాలని కర్ణాటక వకీళ్లను ఆదేశించారు. విచారణను అక్టోబర్ 12కు వాయిదా వేశారు. ఏదేమైనప్పటికీ కర్ణాటకకు తక్షణ ఉపశమనం అనేది దొరకలేదు.
చామరాజనగర జిల్లాలో కావేరి నది ప్రవాహం
తమిళనాడుకు మరోసారి నీటి
విడుదలకు సీడబ్ల్యూఆర్‌సీ ఆదేశం
15 రోజుల్లో 60 వేల క్యూసెక్కులు
ఇవ్వాలి
రాష్ట్ర సర్కారు ముందు గడ్డు సమస్య
మళ్లీ నిరసనలు?
కావేరి జలాలను విడుదల చేయాలని ఆదేశించడం ఇది నాలుగవసారి. ఇప్పటికే మండ్య, మైసూరు జిల్లాల రైతులు తమ పొలాలకు నీరు ఇవ్వకుండా తరలిస్తున్నారని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజా ఆదేశాలతో నిరసనలు భగ్గుమనే అవకాశం కనిపిస్తోంది.


