హుబ్లీ: హోటల్‌లో రొట్టె అడిగితే చేసివ్వలేదని కుక్‌తో ఘర్షణ పడి అతనిని కొట్టి చంపిన కేసులో ఆ హోటల్ సప్లయర్‌కు జీవితఖైదు పడింది. చిన్న చిన్న విషయాలకే ఘర్షణలకు దిగి భారీ మూల్యం చెల్లించుకోవడానికి ఇదో ఉదాహరణ.
వివరాలు.. ఫక్కీరేశ ప్యాటి, కన్యేయప్ప ధార్వాడ సంఘం సర్కిల్‌లోని విమల్ హోటల్‌లో పని చేసేవారు. ఫక్కీరేశ వంట చేసేవారు, కన్యేయప్ప సప్లయర్. పై అంతస్తులో నివసిస్తూ ఉండేవారు. తన భోజనానికి ఫక్కీరేశ రొట్టి చేసి ఇవ్వడం లేదని, అంతేగాక కస్టమర్ల ఆర్డర్లను ఆలస్యంగా చేస్తాడని, అపరిశుభ్రంగా ఉంటాడని కన్యేయప్ప అతనితో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే 2024 పిబ్రవరి 7న ఘర్షణ పడి ఇనుప రేకుతో ఫక్కీరేశను కొట్టడంతో గాయాలై చనిపోయాడు. ధార్వాడ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని కోర్టులో చార్జిషిట్ సమర్పించారు. నేరం రుజువు కావడంతో ధార్వాడ మూడవ అదనపు జిల్లా సెక్షన్ కోర్టు జడ్జి జరీనా ఈ మేరకు తీర్పు ఇచ్చారు. అలాగే రూ.లక్ష జరిమానా కూడా విధించారు.
హత్య కేసులో హోటల్ సప్లయర్‌కు శిక్ష
జైలు వార్డర్ దాష్టీకం
కొట్టడంతో హోటల్ యజమాని మృతి
దొడ్డబళ్లాపురం: భోజనం అయిపోందని చెప్పడం ఓ హత్యకు దారి తీసింది. బెంగళూరు పరప్పన అగ్రహార జైలు వార్డర్ చేసిన దాడిలో డాబా హోటల్ యజమాని మృతిచెందిన సంఘటన బాగలకోట జిల్లా కలాదగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. వార్డర్ అడివెప్ప సెలవులపై స్వంత ఊరు బాగలకోటకు వచ్చాడు. ఈ నెల 17న రాత్రి భోజనం చేయడానికి మెహబూబాసాబ్ పట్టేవాలాకు చెందిన డాబాకు వచ్చాడు. భోజనం అయిపోయిందని పట్టేవాలా చెప్పడంతో అడివెప్ప గొడవకు దిగాడు. రగడ పెద్దదై ఇద్దరూ కొట్టుకున్నారు. మెహబూబాసాబ్ కిందపడి తీవ్రంగా గాయపడగా స్థానికులు అతనిని బాగలకోటలోని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ గురువారంనాడు చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న కలాదగి పోలీసులు అడివెప్పను అరెస్టు చేశారు.


