వైభవం.. హిందూ గణపతిం.. | - | Sakshi
Sakshi News home page

వైభవం.. హిందూ గణపతిం..

Sep 25 2026 2:23 AM | Updated on Sep 25 2026 2:23 AM

సాక్షి,బళ్లారి: నగరంలోని గాంధీభవన్‌లో ప్రతిష్టించిన హిందూ మహా గణపతి శోభాయాత్ర గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. గాంధీభవన్‌ వద్ద నుంచి ప్రారంభమైన హిందూ మహాగణపతి శోభాయాత్ర రాయల్‌ సర్కిల్‌, బెంగళూరు రోడ్డు, మీనాక్షి సర్కిల్‌, పాత బ్రూస్‌పేట పోలీసు స్టేషన్‌, జైన్‌ మార్కెట్‌, గవియప్ప సర్కిల్‌ తదితర ప్రధాన రహదారుల మీదుగా కన్నుల పండవగా, జోరు వర్షంలో భారీ జనం సందోహంతో సాగింది. మహాగణపతికి జైకారాలు కొడుతూ, డీజేలు పెట్టుకుని, భక్తిపాటలకు నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ సుమన్‌ పన్నేకర్‌ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం నగర శివార్లలోని హలకుంది సమీపంలో తుంగభద్ర ఎగువ కాలువలో వినాయక నిమజ్జనం పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌ మోకా తదితరులు పాల్గొన్నారు.

(ఇన్‌సెట్‌లో) హిందూ మహాగణపతి, శోభాయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సోమశేఖరరెడ్డి తదితరులు, శోభాయాత్ర పాల్గొన్న అశేష భక్తజన సందోహం

ఒక వైపు జోరుగా కురిసిన వర్షం

మరో వైపు ఉత్సాహంగా శోభాయాత్ర

భారీ భక్తజనంతో గణేష్‌ నిమజ్జనం

సామరస్యతకు ప్రతీక.. అక్కిపేటె గణపయ్య

ఈసారి ముస్లిం కుటుంబంచే విగ్రహ సేవ

హుబ్లీ: హుబ్లీ– ధార్వాడల్లో వినాయక చవితి వేడుకలు నెల పొడవునా సందడి సృష్టిస్తాయి. ఈ క్రమంలో మత సామరస్యానికి ప్రతీకగా పాత హుబ్లీ అక్కిపేటెలో మత సామరస్యానికి ప్రతీకగా గణపతిని ఇక్కడ కొలువు తీర్చారు. వేంకటేశ్వర ఆలయ ట్రస్ట్‌ ఈ వేడుకలను గత 75 ఏళ్లుగా నిర్వహిస్తోంది. ప్రతి ఏటా స్థానిక కుటుంబాలు వంతుల వారీగా వినాయక విగ్రహానికి కావాల్సిన ఖర్చును భరిస్తారు. ఈ సారి ఓ ముస్లిం కుటుంబానికి చెందిన స్థానిక కటగర వీధి నివాసి బుడేన్‌సాబ్‌ కిత్తూరు రూ.15 వేలతో వినాయక విగ్రహానికి సహాయం అందించారు. దీంతో మతసామరస్యతకు ప్రతీకగా ఈ వేడుకలు భక్తిశ్రద్ధలతో రోజు నెరవేరుతున్నాయి. సాధారణంగా 5, 7, 9, 11 రోజుల పాటు వినాయక విగ్రహాలను కొలువు తీర్చుతారు. అయితే అక్కిపేటె గణపతిని గత మూడేళ్ల నుంచి ఓ నెల రోజుల పాటు కొలువు తీర్చి మహానవమి(దసరా) ముగిసిన తక్షణమే నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా బుడేన్‌సాబ్‌ కిత్తూరు మాట్లాడుతూ ఈ సారి తాను ఇక్కడ లేకున్నా కూడా ప్రస్తుతం వేరే చోట నివసిస్తున్నానన్నారు. అయితే అక్కిపేటె గణపతికి తన వంతుగా విగ్రహానికి విరాళం అందించానన్నారు. హిందూ ముస్లింల సామరస్యానికి, సమైక్యతకు ఇక్కడి వినాయక ఉత్సవాల్లో ఎటువంటి మత విభేదాలు, విద్వేషాలు లేకుండా భక్తిశ్రద్ధలతో అందరం కలిసి లౌకిక భావంతో పాల్గొంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement