బనశంకరి: ప్రతి పనికీ ప్రజల నుంచి లంచాలు గుంజుతూ, పథకాల్లో కమీషన్లు కొట్టేస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకున్న కొందరు ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు లోకాయుక్త షాక్ ఇచ్చింది. మంగళవారం ఉదయం నుంచి ఆకస్మిక దాడులను ప్రారంభించింది. పలుజిల్లాల్లో 8 మంది అధికారుల ఆఫీసులు, ఇళ్లు, వారి బంధుమిత్రుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. బెంగళూరు, బీదర్, మండ్య, చిక్కబళ్లాపుర, కొడగు జిల్లాల్లోని అధికారుల ఇళ్లలో దాడులు జరిగాయి. భారీ ప్రమాణంలో నగదు, బంగారు నగలు, విలాసవంతమైన వస్తువులు ఆస్తిపాస్తుల పత్రాలు, పెద్దసంఖ్యలో ఖరీదైన మద్యం సీసాలు, బట్టలు లభించాయి.
ఇంటినిండా విదేశీ వైన్లు
● మాణిక్ శెరికార్‌కు చెందిన బీదర్ నగరం హళ్లికాలనీ నివాసం, హుమ్నాబాద్, ముత్తంగి గ్రామంలోని ఫాంహౌస్‌లపై లోకాయుక్త డీఎస్పీ హనుమంతరెడ్డి నేతృత్వంలో దాడులు చేశారు.
● జెస్కాం ఏఈఈ రాజేశ్వరి ఆఫీసు, కలబుర్గి నగరం మహాలక్ష్మీ లేఔట్‌లోని రాజేశ్వరి నివాసం, ఖాద్రి చౌక్‌లో మరో ఇంటిపై దాడులు జరిగాయి.
● మండ్యలో హాస్టల్ అధికారి శివరాజు ఇంట్లో 50కి పైగా విదేశీ మద్యం, వైన్ సీసాల డంపు బయటపడింది. వాటిని ఎకై ్సజ్ అధికారులు సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
● చాలామంది అధికారులు ఉదయం వాకింగ్‌కు వెళ్లి వచ్చేలోగా లోకాయుక్త సిబ్బంది ఉండడంతో నివ్వెరపోయారు. వారి ఆదాయమూలాలు, ఆస్తిపాస్తులు, ఆర్థిక వ్యవహారాల తనిఖీ కొనసాగుతోంది.
ఎవరెవరి మీద దాడులు జరిగాయంటే
1.దర్శన్‌గౌడ– ఎఫ్‌డీఏ, చిక్కబళ్లాపురం కలెక్టరేటు
2.రంగనాథ్ హెచ్‌ఎం– విశ్రాంత అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈఈ) బీబీఎంపీ , బెంగళూరు
3. శ్రీదేవి– జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి, బెంగళూరు
4.హెచ్‌ఆర్.రమేశ్– మడికెరి నగరసభ, కమిషనర్
5. కిరణ్‌కుమార్ బైందూర్– అసిస్టెంట్ ఇంజనీర్ హెస్కాం, హుబ్లీ– ధార్వాడ
6. రాజేశ్వరి– అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈఈ, జెస్కాం, కలబుర్గి
7. మాణిక్‌రావ్ శెరికార్– రిటైర్డు అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయశాఖ, బీదర్
8. శివరాజు– బీసీ హాస్టల్ అధికారి, మండ్య
రాష్ట్రంలో 8 మంది అధికారుల ఇళ్లు,
ఆఫీసుల్లో సోదాలు
పెద్దమొత్తంలో బంగారం,
అక్రమాస్తుల గుర్తింపు
హాస్టల్ అధికారి ఇంట్లో ఏకంగా
బ్రాందీ షాపు


