దొడ్డబళ్లాపురం: కుమార్తెను ప్రేమిస్తున్న యువకున్ని ఆమె తల్లితండ్రులు హత్య చేసిన ఘటన దావణగెరె జిల్లా మొళకాల్మూరు తాలూకా తళవారహళ్లిలో వెలుగుచూసింది. వివరాల మేరకు.. హానగల్ గ్రామానికి చెందిన నాగేశ్ (22), పొరుగూరు రుద్రమ్మనహళ్లికి చెందిన యువతి, రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. తమ కూతురి జోలికి రావద్దని యువతి తల్లిదండ్రులు అనేకసార్లు నాగేశ్‌ను హెచ్చరించినా మార్పు రాలేదు. ఆగ్రహానికి లోనైన యువతి తల్లిదండ్రులు మాట్లాడాలని నాగేశ్‌ని తళవారహళ్లి వద్ద నిర్జన ప్రదేశానికి పిలిపించారు. అక్కడ రాళ్లు, కత్తులతో హత్య చేసి పరారయ్యారు. 2 రోజుల కిందట జరిగిన హత్య మంగళవారం బయటపడింది. మొళకాల్మూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు, ఇంతలోనే నిందితులు ఊరు వదిలి పరారయ్యారు.
మొదటి భర్తే కావాలంటూ..
యశవంతపుర: పలు కారణాలతో అనైతిక సంబంధాలు అధికమవుతున్నాయి. భర్తను వదిలేసి వెళ్లిన వివాహిత వైనం హాసన్‌లో సంచలనం కలిగిస్తోంది. భర్త రాజశేఖర్, ప్రియాంక దంపతులు ఉంటున్నారు. ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయింది. రాజశేఖర్ మాట్లాడుతూ ప్రియాంకకు గతంలోనే పెళ్లయి వదిలేసింది, ఆ విషయం చెప్పకుండా తనతో పెళ్లి చేశారని ఆరోపించాడు. మొదటి భర్త వద్దకు వెళ్లిపోయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. తమను మోసం చేశారంటూ రాజశేఖర్ కుటుంబీకులు ప్రియాంక తల్లిదండ్రులతో గొడవకు దిగారు.
వర్సిటీ వద్ద గంజాయి గుప్పు
దొడ్డబళ్లాపురం: బెంగళూరు రూరల్‌లోని దొడ్డబళ్లాపురం వద్ద కళాశాలల వద్ద విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు డ్రగ్స్‌విక్రేతలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.6లక్షల విలువ చేసే 5.6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నాగదేనహళ్లి సమీపంలో ఉన్న గీతం యూనివర్సిటీ వద్ద నిందితులు విద్యార్థులకు గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సురేశ్ సహాని (34), రోహిత్ కుమార్ (25), రూపేశ్ కుమార్ (30)ను అరెస్టు చేసి విచారించగా బీహార్, జార్ఖండ్ నుంచి ఇక్కడకు వలస వచ్చి మొదట బేల్దారీ పని చేసేవారని తెలిపారు. తరువాత సులభంగా సంపాదన కోసం గంజాయి వ్యాపారులగా మారారు. గంజాయితోపాటు కొత్త బైక్‌ని స్వాధీనం చేసుకున్నారు.
నన్ను జైల్లోనే చంపేస్తారు
● విచారణలో రోదించిన పవిత్రగౌడ
యశవంతపుర: ‘నా బ్యారక్‌లో నైజీరియా మహిళా ఖైదీలు నన్ను హింసిస్తున్నారు. వారు నన్ను చంపేస్తామని చెబుతున్నారు’ అని నటి పవిత్రగౌడ జడ్జి ముందు విలపించింది. చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో పరప్పన జైల్లో ఉన్న ఆమె బెయిలు కోసం బెంగళూరు 59 సీసీహెచ్ కోర్టులో పిటిషన్ వేశారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిగింది. పవిత్రగౌడ విలపిస్తూ గోడును వెళ్లబోసుకుంది. తన బ్యారక్‌లో నైజీరియా మహిళా నిందితులు ఉన్నారని, గతంలో వేధిస్తున్నారని జైలు అధికారులకు ఫిర్యాదు చేశానని తెలిసి మరింత సతాయిస్తున్నారని, హత్య చేస్తామని బెదిరిస్తున్నారని పవిత్ర రోదించింది. తనకు చనిపోవాలని ఉందని, విషం కావాలని విలపిస్తూ చెప్పిందని ఆమె న్యాయవాదులు తెలిపారు.
హైకోర్టుకు దర్శన్ భార్య
రేణుకాస్వామి హత్యకేసులో అప్రూవర్‌గా మారతానని ప్రకటించిన ప్రదోశ్‌కు వ్యతిరేకంగా రెండో నిందితుడు, నటుడు దర్శన్ భార్య విజయలక్ష్మి మళ్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతడు దర్శన్‌కు శత్రువని, స్వార్థం కోసం అప్రూవర్ అవుతున్నాడని, అనుమతించరాదని కోరారు.


