దొడ్డబళ్లాపురం: అక్రమంగా నాటు తుపాకులను తయారు చేస్తున్న కంత్రీ ముఠాని బెంగళూరు వద్ద ఆనేకల్ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 7 పిస్టళ్లు, 10 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన జబల్‌పూర్ జిల్లా బేడఘాట్ గ్రామం నివాసి ప్రదీప్ రమేశ్, బెంగళూరు కేజీ హళ్లి నివాసి కుళ్ల రిజ్వాన్, ఆనేకల్ నివాసులు మనోజ్, వెంకటరాజు, శివరాజ్, నంజప్ప, గోపి అరెస్టయ్యారు. ముఠా సూత్రధారి దావూద్ అనే నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ఇలా దొరికాడు
పోలీసులు తెలిపిన మేరకు... జబల్‌పూర్ దావూద్ బెంగళూరుతోపాటు అనేక ప్రాంతాలకు నాటు తుపాకులను సరఫరా చేసేవాడు. అనుచరుడు ప్రదీప్ రమేశ్ ద్వారా మూడు పిస్టళ్లు, 10 బుల్లెట్లు ఇచ్చి రైలులో ఆనేకల్‌కు పంపించాడు. రైలు దిగి సమీపంలోని నీలగిరి తోటలో కస్టమర్‌ల కోసం వేచి చూస్తుండగా పోలీసులు చూసి అనుమానంతో ప్రశ్నించారు. దీంతో పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. నిందితుని నుంచి సేకరించిన సమాచారంతో, ఆ ఆయుధాలను ఆర్డర్ చేసిన స్థానిక రౌడీలను అరెస్టు చేశారు. సోదాల్లో మనోజ్, కుళ్ల రిజ్వాన్‌ల వద్ద ఒక్కో పిస్టల్ లభించాయి. వాటిని చూపించి దందాలకు పాల్పడుతున్నట్లు తేలింది. నిందితులపై కోకా చట్టం కింద కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్ జబల్‌పూర్ నుంచి
బెంగళూరుకు!
ఆరుగురు నేరగాళ్లు, ఎంపీవాసి అరెస్టు


