● రూ.కోట్లలో వ్యాపార లావాదేవీలు
● పట్టించుకోని ఉన్నతాధికారులు
రాయచూరు రూరల్: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షక భటుడే కాల యముడిగా మారి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రూ.కోట్లలో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న రక్షక భటుడి వ్యవహారంపై కళ్లున్నా కబోదిలా ఎస్పీ అరుణాంగ్శు గిరి వ్యవహరిస్తున్నారు. లింగసూగూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న విజయ్ కుమార్ కుటుంబ సభ్యుల పేరు మీద ఆదాయానికి మించి ఆస్తులు, భూములు సంపాదించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజయ్ కుమార్ కుటుంబం ఆర్‌ఓ ప్లాంట్, బార్ అండ్ రెస్టారెంట్‌ను నడుపుతున్నా పోలీస్, జిల్లా పాలన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
లారీ ఢీకొని వ్యక్తి మృతి
క్రిష్ణగిరి: ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన క్రిష్ణగిరి డ్యాం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. తిరుపత్తూరు జిల్లా జల్లియూరు గ్రామానికి చెందిన భూపతి కొడుకు తమిళరసన్ (23) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం మిత్రుడు గోపినాథ్‌తో కలిసి బైక్‌లో క్రిష్ణగిరి డ్యాంకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వెళ్తుండగా సోక్కాడి వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తమిళరసన్ మృతి చెందాడు. ఈ ఘటనపై క్రిష్ణగిరి డ్యాం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
గంజాయి స్వాధీనం
కేజీఎఫ్: మాదక ద్రవ్యాల విక్రయం కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 792 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తాలూకాలోని కేసరిహళ్లి క్రాస్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న నిందితుడు సంజయ్‌ను అరెస్టు చేసి 480 గ్రాముల గంజాయి పట్టుకున్నారు. అలాగే ఖాదర్ లేఅవుట్ వద్ద గంజాయి విక్రయిస్తున్న యువరాజ్, ప్రసన్నను అరెస్టు చేశారు. వీరి నుంచి 196 గ్రాముల గంజాయి స్వీధీనం చేసుకున్నారు. ఖాదర్ లేవుట్‌లో గంజాయి విక్రయిస్తున్న మరో నిందితుడు నూర్ మహ్మద్‌ను అరెస్టు చేసి, 116 గ్రాముల గంజాయి సీజ్ చేశారు. గంజాయి సేవిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.
ఆత్మరక్షణకు కరాటే అవసరం
కోలారు: నగరంలోని జపాన్ శిటోరియా రియల్ కరాటే పాఠశాలలో రాము మార్షల్ ఆర్ట్స్ అకాడమి, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర కరాటే చాంపియన్‌షిప్– 2026 పోటీలను డీఎస్పీ కృష్ణప్ప ప్రారంభించారు. ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరు కరాటేను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని డీఎస్పీ అన్నారు. బాల బాలికలందరూ కరాటేను తప్పనిసరిగా నేర్చుకోవాలన్నారు. కరాటే పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి సుమారు 600 మందికి పైగా పాల్గొన్నారు. జపాన్ శిటోరియా కరాటే పాఠశాల, రాము మార్షల్ ఆర్ట్స్ అకాడమి అధ్యక్షుడు కరాటే రాము, తారక మంజునాథ్ తదితరులు ఉన్నారు.
అక్రమ పదోన్నతిపై
చర్యలకు డిమాండ్
కోలారు: నకిలీ మార్కుల జాబితా తయారు చేసి పదోన్నతి పొందిన ఎల్.అజిత్‌కుమార్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ద్రావిడ విమోచన సంఘం కార్యకర్తలు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ ఎస్‌ఎం మంగళకు వినతిపత్రం సమర్పించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అనంతకీర్తి మాట్లాడుతూ జిల్లా నగరాభివృద్ధి ప్రాధికార ఫస్ట్ గ్రేడ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న అజిత్‌కుమార్ గతంలో శ్రీనివాసపురం పురసభలో ద్వితీయ శ్రేణి సహాయకులుగా విధులు నిర్వహిస్తున్న సమయంలో 2021వ సంవత్సరం శాఖా పరీక్షకు హాజరై మొత్తం 7 పరీక్షలు రాసినట్లు దాఖలాల ద్వారా తెలిసింది. అయితే అజిత్‌కుమార్ నకిలీ మార్కుల జాబితాతో శాఖలో ప్రమోషన్ సాధించారని ఆరోపించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి అజిత్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేఎం వాసుదేవ్, మంజునాథ్, ఎస్.సంతోష్‌కుమార్, నవీన్‌కుమార్ ఉన్నారు.
బెస్ట్ ఆగ్రోలో
కొత్త ఉత్పత్తుల విడుదల
సాక్షి,బళ్లారి: మారుతున్న కాలానుగుణంగా వ్యవసాయ రంగంలో రైతులు వినూత్న తరహాలో కొత్త కొత్త పంటలు పండించుకోవడంతో పాటు మంచి దిగుబడులు సాధించేందుకు బెస్ట్ ఆగ్రో లైఫ్‌లో నూతన ఉత్పత్తులు విడుదల చేసినట్లు ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ సతీష్ మల్హోత్రా పేర్కొన్నారు. నగరంలో ఓ హోటల్‌లో బెస్ట్ ఆగ్రో లైఫ్ సంబంధించి నూతన ఉత్పత్తులను విడుదల చేశారు. రైతులు, డీలర్లు, కంపెనీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని వ్యవసాయ రంగంలో మంచి పంటలు పండించడానికి ఈ ఉత్పత్తులు ఉపయోగపడతాయన్నారు. మంచి దిగుబడులు సాధించేందుకు, శక్తివంతమైన నేలను మార్చడానికి, రకరకాల తెగుళ్ల నివారణకు ఈ మందులు దోహదం చేస్తాయని గుర్తు చేశారు. ఉత్తర కర్ణాటక జోన్ ఇన్‌చార్జి రవీంద్రబాబు, దక్షిణ జోన్ ఇన్‌చార్జి చేతన్ కుమార్, సౌత్ బిజినెస్ హెడ్ సిద్దప్ప రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.


