సాక్షి,బళ్లారి: నగరంలోని ఇన్నారెడ్డి కాలనీలో దొంగలు తమ చేతివాటాన్ని చూపారు. ఓ ఇంటి కిటికీ గ్రిల్ కత్తిరించి, బీరువాలో భద్రపరిచిన రూ.20 లక్షల బంగారం, ఓ వెండి ఆభరణాలను దొంగలించారు. సోమవారం రాత్రి నగరంలోని వ్యాపారి ఎం.శ్రీధర్ ఇంట్లో కుటుంబ సభ్యులంతా కింద అంతస్తులో పడక గదిలో నిద్రిస్తుండగా పక్కనే ఉన్న మరో పడక గది కిటికీ గ్రిల్‌ను కత్తిరించి ఇంట్లోకి ప్రవేశించారు.
లాకర్‌లో ఆభరణాలతో పరారీ
అనంతరం గదిలో బీరువా తాళం ఉపయోగించి లాకర్ తెరిచి అందులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలు, నగదును దోచుకెళ్లారు. చోరీకి గురైన ఆభరణాల్లో దాదాపు రూ.3 లక్షల విలువ చేసే గొలుసు, రూ.93 వేలు విలువ చేసే 11 గ్రాముల చైన్, రూ.1.50 లక్షల విలువ చేసే 17 గ్రాముల రెండు గాజులు, రూ.44 వేలు విలువ చేసే 6 గ్రాముల చిన్న బ్రాస్‌లెట్ ఇలా చిన్న చిన్న బంగారు ఆభరణాలు, వెండి మొత్తం స్వాహా చేసి గుట్టు చప్పుడు కాకుండా పరారయ్యారు.
ఎస్పీ తదితరుల పరిశీలన
దాదాపు రూ.20 లక్షల విలువ చేసే 212 గ్రాముల బంగారు, ఒక కేజీ వెండి దీపాలతో కలిపి 1200 గ్రాముల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే ఎస్పీ సుమన్ పన్నేకర్, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఇంట్లోకి దొంగలు చొరబడిన తీరును, బంగారు ఆభరణాలు చోరీ చేసిన ప్రాంతాన్ని పరిశీలించారు. కాగా నగరంలో ఇటీవల మళ్లీ దొంగల బెడద ప్రారంభం కావడంతో నగర వాసులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
రూ.20 లక్షల విలువైన
ఆభరణాలు చోరీ
దొంగల బెడదతో
భయాందోళనలో ప్రజలు


