ఆయుష్‌ వైద్యులపై దాడులు తగదు | - | Sakshi
Sakshi News home page

ఆయుష్‌ వైద్యులపై దాడులు తగదు

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలోని ఆయుర్వేద, యునాని ఆస్పత్రుల్లో విధులు నిర్వహించే ఆయుష్‌ వైద్యులపై నిరంతరం దాడులు చేయడం తగదని ఆయుష్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆందోళన చేపట్టింది. మంగళవారం నగరసభ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు శ్రీకాంత్‌ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో ఆరోగ్య సేవలు చేయాలనే సదాశయంతో విధులు నిర్వహించే వైద్యులకు ఆర్టీఐ కార్యకర్తల నుంచి భయం ఉందని, అలాంటి వారిపై జిల్లా పాలన యంత్రాంగం చర్యలు చేపట్టాలని కోరారు. ఇటీవల జిల్లాలో దాడులు అధికమయ్యాయని, తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఆందోళనలో ఆనంద్‌, మోహన్‌ బిరాదార్‌, సునీల్‌ హిరేమట్‌లున్నారు.

సహకార సంఘం అధికారి ఆత్మహత్య

రాయచూరు రూరల్‌: ప్రాథమిక సహకార సంఘం ముఖ్య కార్యదర్శి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. మెదికినాళ ప్రాథమిక సహకార సంఘంలో ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న బసవరాజ్‌(40) సోమవారం రాత్రి లింగసూగూరు తాలూకా మెదికినాళలో వేప చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బసవరాజ్‌ వ్యాపారాలు చేయడానికి కొంత మంది నుంచి అప్పు తీసుకున్నారు. తీసుకున్న అప్పులను తీర్చాలని అప్పులిచ్చినవారు ఒత్తిడి చేశారు. మరో వైపు రాయచూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్‌ మస్కి బ్రాంచ్‌ మేనేజర్‌ నాగరత్న డబ్బులు తీసుకొని ఉద్యోగం లేదా డబ్బులు వాపస్‌ ఇవ్వక పోవడంతో మనస్తాపం చెంది ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు మస్కి పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ దత్తాత్రేయ కర్నాడ్‌ వివరించారు.

పిడుగుపాటుకు

నలుగురు మృతి

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటక, ఉత్తర కర్ణాటకలో సోమవారం రాత్రి ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో ఇద్దరు మహిళలు, ఉత్తర కర్ణాటకలో ఇద్దరు మరణించారు. ఉత్తర కర్ణాటకలోని బెళగావి జిల్లా యరగట్టి తాలూకా మద్దూరులో మొక్కజొన్నల కల్లం చేయడానికి వెళ్లిన రైతులను కేదారప్ప బసప్ప(47) భీమప్ప కేదారప్ప(45)లుగా గుర్తించినట్లు తహసీల్దార్‌ గుండప్ప వెల్లడించారు. కళ్యాణ కర్ణాటకలోని కలబుర్గి జిల్లా కమలాపూర్‌ తాలూకా నాగూర్‌లో లక్ష్మి గుత్తేదార్‌(45), కూలీ కార్మికురాలు శహజాద్‌ బీ(60) పొలంలో పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై మరణించారని పోలీసులు తెలిపారు.

ఫార్మసిస్టుల పాత్ర అమోఘం

రాయచూరు రూరల్‌: వైద్య రంగంలో నిరంతర అధ్యయనంతో పాటు ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర అమోఘమని నవోదయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ గురుదత్త పవార్‌ పేర్కొన్నారు. నవోదయ ఫార్మసీ వైద్య కళాశాలలో జరిగిన నూతన ఫార్మసీ విద్యార్థుల ప్రవేశం సందర్భంగా పాఠ్యాంశాలపై విద్యార్థుల నుద్దేశించి ఆయన మాట్లాడారు. విద్యార్థులు త్వరిత గతిన ఫలితాలు పొందాలనే ఆశ ఉన్నా దానికి తగ్గట్టు విద్యనభ్యసించ లేకపోతున్నారన్నారు. నవోదయ వైద్య కళాశాల అందిస్తున్న వైద్యసేవలు అనన్యమన్నారు. పేదలకు ఉచిత సేవలు చేయడం అభినందనీయమన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ దొడ్డయ్య, రామ్‌మోహన్‌ గుప్త, ప్రకాష్‌, కౌశిక్‌ రెడ్డి, రేవణసిద్దప్ప, చంద్రమౌళి, సురేష్‌బాబు, సర్ఫరాజ్‌లున్నారు.

పోషణ్‌ మాసోత్సవం

హొసపేటె: జిల్లాలోని హొసపేటె తాలూకా గాదిగనూరు పోలీసు స్టేషన్‌ పరిధిలోని పాపినాయకనహళ్లి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం–4లో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంగళవారం పోషణ్‌ మాసోత్సవం నిర్వహించింది. జోనల్‌ సూపర్‌వైజర్‌ లక్ష్మిదేవి, ఆయుర్వేద వైద్యాధికారి హేమలత, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హేమారెడ్డితో పాటు గర్భిణులు, బాలింతలు, అంగన్‌వాడీ కార్యకర్తలు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement