రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సక్రమంగా సరఫరా చేయాలని కోరుతూ రాయచూరు రూరల్ మాజీ శాసన సభ్యుడు తిప్పరాజ్ హవల్దార్ రాయచూరు జెస్కాం కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన రైతులతో కలిసి అధికారులను ముట్టడించిన ఘటన చోటు చేసుకుంది. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ నుంచి ర్యాలీగా వెళ్లి జెస్కాం కార్యాలయాన్ని చేరుకుని ముట్టడించి 12 గంటల పాటు విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో విద్యుత్ సరఫరా లేక కరువు సహాయక పనులు చేపట్టక పోవడాన్ని ఖండించారు. కరువు నెలకొన్నందున రైతులకు రూ.50 వేలు పరిహారం అందించాలని, రైతులకు 12 గంటల పాటు విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు. తుంగభద్ర ఎడమ కాలువ కింద ఉపకాలువలకు నేటికీ నీటిని విడుదలలో నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. అనంతరం జిల్లాధికారి కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో మాజీ నేతలు శంకరప్ప, నిత్యానందరెడ్డి, కేశవరెడ్డి, అచ్యుతరెడ్డి, సిద్దనగౌడ, బండేష్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.


