రాయచూరు రూరల్: మహిళల ఉజ్వల భవిష్యత్తుకు సహనం పునాది కావాలని కొప్పళ కవయిత్రి రాజేశ్వరి అభిప్రాయ పడ్డారు. నగరంలోని కన్నడ భవనంలో కసాప ఏర్పాటు చేసిన దత్తి ఉపన్యాస కార్యక్రమంలో అవార్డును అందుకుని ఆమె మాట్లాడారు. కవులు, సాహితీవేత్తల ప్రతిభకు తార్కాణంగా మహిళలు భవిష్యత్తును రూపొందించుకోవాలన్నారు. రంగణ్ణ, రావుతరావ్, రాజేంద్ర, వసంత్ కుమార్, మంజునాథ్, యశోద, దండెప్ప బిరాదార్‌లున్నారు.
పేదలకు ఇళ్లు
మంజూరు చేయరూ
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వ దేవరాజ్ అరసు మండలి, ప్రధానమంత్రి ఆవాస్ పథకంలో వెనుక బడిన వర్గాల శాఖ నుంచి మురికివాడల ప్రజలకు ఇళ్లు మంజూరు చేయాలని మురికి వాడల వేదిక డిమాండ్ చేసింది. సోమవారం సిటీ కార్పొరేషన్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు జనార్దన్ మాట్లాడారు. వీధి వ్యాపారస్తులు, కుష్టురోగులు, దివ్యాంగులు, సఫాయి కర్మచారులు, దేవదాసీ మహిళలు, వితంతువులు, పేదలు ఇళ్లు నిర్మించుకోడానికి రెండేళ్ల క్రితమే దరఖాస్తు చేసుకున్నా అధికారులు నిరక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.
పిల్లల భవిష్యత్తుకు
టీచర్లు పునాది
రాయచూరు రూరల్: పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు పునాది కావాలని రాయచూరు మహర్షి వాల్మీకి విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ శివానంద పేర్కొన్నారు. పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో సంకుల కలా సంస్థ ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ దినోత్సవంలో మాట్లాడారు. విద్యా శాఖలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు పిల్లల సంక్షేమం కోసం పాటుపడాలన్నారు. ప్రతిభకు తార్కాణంగా విద్యార్థులు భవిష్యత్తును రూపొందించాలన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. సతీష్, అనిత, సంస్థ అధ్యక్షుడు మారుతి, కార్యదర్శి రేఖ, శ్రీదేవి నాయక్, సర్కారీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ, బసవరాజ్, రాజశేఖర్, శివశంకర్‌లున్నారు.
డిసెంబర్ 12, 13 తేదీల్లో బిదరి ఉత్సవాలు
హుబ్లీ: బీదర్‌లోని డాక్టర్ చెన్నబసవ పట్టదేవరు జిల్లా రంగమందిరంలో డిసెంబర్ 12, 13 తేదీల్లో బిదరి ఉత్సవాలు, రాష్ట్రస్థాయి అవార్డుల ప్రదానోత్సవం ఏర్పాటు చేసినట్లు సాంస్కృతిక వేదిక అధ్యక్షురాలు రేఖా సవది తెలిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సోమవారం ఆమె విలేకరులకు వివరించారు. గత కొన్నేళ్లుగా మాదిరిగానే ఈ ఏడాది కూడా కన్నడ సంస్కృతి శాఖ సహకారంతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. సీనియర్ రచయిత్రి భారతీ వస్త్రద్, పుణ్యవతి నిసాది మాట్లాడుతూ బిదరి ఉత్సవాలు జిల్లాకే గర్వకారణమన్నారు. జిల్లా రంగమందిరంలో నిర్వహించడం శుభపరిణామం అన్నారు. విలేకరుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద దేవప్ప తదితరులు పాల్గొన్నారు.
కొండముచ్చు తోసేయడంతో
వృద్ధురాలు మృతి
సాక్షి,బళ్లారి: ఇంటి ముందు నిల్చున్న వృద్ధురాలిపై కొండముచ్చు దాడి చేసి తోసేయడంతో తలకు తీవ్ర గాయాలై మృతి చెందింది. కొప్పళ నగరంలోని నజమున్నీసా బేగం(91) అనే వృద్ధురాలు తన ఇంటి ముందు నిలబడి ఉండగా కొండముచ్చు ఉన్నఫళంగా దాడి చేసి వృద్ధురాలిని తోసేసింది. దీంతో కిందపడటంతో ఆమె తలకు తీవ్ర గాయాయలై మృతి చెందడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న కోతుల బెడద నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నకిలీ దేశభక్తి తేటతెల్లం
హుబ్లీ: ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం చట్టాన్ని ఉల్లంఘిస్తూ, వందేమాతరం గీతాన్ని పూర్తిగా పాడకుండా కేవలం రెండు చరణాలే పాడి కాంగ్రెస్ తన నకిలీ దేశభక్తిని చాటుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దుయ్యబట్టారు. సోమవారం ఆయన ట్వీట్ చేశారు. జాతీయ గీతానికి దీని వల్ల అవమానం చేశారని ఆరోపించారు. దీంతో కాంగ్రెస్ దేశభక్తి బూటకమని తేలిపోయిందన్నారు. ఇది అత్యంత ఖండనీయమన్నారు. కాంగ్రెస్‌కు దేశభక్తి గీతాన్ని చూసి ఎందుకు ఇంత ద్వేషం అన్నారు.


