రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లోని పేద పిల్లలు ఉన్నత చదువుల కోసం పట్టణాలకు వస్తే విద్య అలవడుతుందని హాస్టల్‌లో ఉండి చదువుకునే విద్యార్థులు అసౌకర్యాల మధ్య సరైన వెలుతురు లేక చిరిగిన గోనె సంచులతో కిటికీలకు తెరలు కట్టిన ఉదంతం నగరంలో వెలుగు చూసింది. హాస్టల్‌కు సరైన తాగునీటి సౌకర్యం కల్పించలేదు. బిజినగేర రోడ్డులోని డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ హాస్టల్‌లో ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులు చదివే 154 మంది విద్యార్థులకు, 54 గదులు కేటాయించారు. హాస్టల్ వార్డెన్ మహబూబ్ తనకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అటవీ ప్రాంతంలో కొండగుట్టలపై హాస్టల్ ఉంది. రాత్రి వేళ విద్యుత్ కోత విధిస్తే జనరేటర్‌ను ఉపయోగించడం లేదని విద్యార్థులు వాపోయారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు శుభ్రం చేయకుండా అలాగే వదిలేశారు.
సోలార్ ఉన్నా.. ఉపయోగం లేదన్నా..
హాస్టల్ పైభాగంలో సోలార్ విద్యుత్ సౌకర్యం ఉన్నా ఉపయోగించకుండా నిర్లక్ష్యంగా ఉన్నారు. విద్యుత్ పరికరాలకు సంబంధించిన వైర్లు బోర్డు నుంచి బయటకొచ్చినా, స్విచ్‌లు విరిగిపోయినా వాటికి మరమ్మతు పనులు చేపట్టకుండా వదిలేయడంతో ఏ సమయంలో విద్యుత్ వైర్లు షాక్ కొడతాయో అనే భయం విద్యార్థుల్లో నెలకొంది. గదులకు సరైన తలుపులు లేవు. విద్యుత్ బల్పులు అమర్చకుండా, ఫ్యాన్లు వేయకుండా వార్డెన్ నిర్లక్ష్యం వహిస్తున్నారు. మూడంతస్థుల భవనంలో వర్షపు నీరు వచ్చినా పట్టించుకోక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న సాంఘీక సంక్షేమ శాఖ జిల్లా, తాలూకా స్థాయి అధికారులు ఇకనైనా మేలుకోవాల్సి ఉంది.
అస్తవ్యస్తంగా డాక్టర్ బీఆర్
అంబేడ్కర్ బాలుర హాస్టల్
అసౌకర్యాల మధ్య పేద గ్రామీణ విద్యార్థులు సతమతం


