బళ్లారి రూరల్ : కుటుంబలో మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబమంతా విద్యావంతులవుతారు. కుటుంబమంతా విద్యావంతులైతే సమాజానికి, తద్వారా దేశాభివృద్ధి చెందుతుందని విజయపుర అక్కమహాదేవి మహిళా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ విజయ బి.కోరిశెట్టి తెలిపారు. ఉజ్జయిని పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 జగద్గురు సిద్దలింగ దేశీకేంద్ర శివాచార్య భగవత్పాద మహాస్వామి సాన్నిధ్యంలో సోమవారం నగరంలోని ఏఎస్‌ఎం కళాశాల సువర్ణ మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వీరశైవ విద్యావర్థక సంఘం 1916లో ప్రారంభమైంది. వేలాది మందికి జ్ఞానాన్ని పంచి ఉత్తమ భవితను అందించింది. మహిళ విద్యా ఉన్నతికి అల్లం సుమంగళమ్మ మహిళా విద్యాలయాన్ని ఏర్పాటు చేసి వెనుక బడిన కళ్యాణ కర్ణాటక మహిళల అభివృద్ధికి తోడ్పడ్డారని తెలిపారు. అక్క మహాదేవి మహిళా విశ్వవిద్యాలయంలో ఏఎస్‌ఎం కళాశాల మంచి గుర్తింపు తెచ్చుకొందన్నారు. రాష్ట్రంలో 158 మహిళా విద్యాలయాలు ఉన్నట్లు తెలిపారు. మహిళా విశ్వవిద్యాలయం 2013లో విజయోత్సవాలను జరుపుకొన్నట్లు తెలిపారు. మరో అతిథి బెంగళూరు జయదేవ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ విజయలక్ష్మి బాళెకుంద్రి మహిళల ఉన్నత విద్య గురించి మాట్లాడారు. ప్రముఖుడు అల్లం వీరభద్రప్ప, మేయర్ గాదెప్ప, గురు వామదేవ మహంత శివాచార్య మహాస్వామి, జగద్గురు సిద్దలింగ రాజ దేశికేంద్ర శివాచార్య భగవత్పాద మహాస్వామి, వీవీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ కణేకల్ మహంతేశ్, ఉపాధ్యక్షుడు జానెకుంటె బసవరాజు, కోశాధికారి బైలువద్దిగేరి ఎర్రిస్వామి, ప్రముఖులు అల్లం ప్రమోద్, కళాశాల పాలక మండలి అధ్యక్షురాలు కాత్యాయిని మరిదేవయ్య, ప్రిన్సిపాళ్లు డాక్టర్ దూపం సతీష్, డాక్టర్ బి.గోవిందరాజులు, విద్యార్థులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 158 మహిళా
విద్యాలయాలు ఉన్నాయి
మహిళా వర్సిటీ వీసీ ప్రొఫెసర్
విజయ బి.కోరిశెట్టి


