సాక్షి, బళ్లారి: ఎల్‌నీనో ప్రభావంతో రాష్‌ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర డ్యాంలో రోజు రోజుకు నీటి నిల్వ తగ్గిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఆలస్యంగా డ్యాంలోకి నీరు చేరడంతో కాలువలకు కూడా నీరు ఆలస్యంగా విడుదల చేశారు. డ్యాంలో ప్రస్తుతం 80 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. డ్యాం నుంచి రోజూ హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, ఎల్‌బీఎంసీ తదితర కాలువకు ఒక టీఎంసీకి పైగా నీరు విడుదల చేస్తున్నారు. దీంతో డ్యాంలో నీటి నిల్వ క్రమేణా తగ్గిపోతోంది. ఇక వర్షాలు కురవకపోవడంతో ఇన్‌ఫ్లో కూడా జీరోస్థాయికి పడిపోయింది. డ్యాంలో ఉన్న నీటితోనే ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు నీరు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి నెలకొనడంతో రైతులు పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. డ్యాం కింద ప్రధానంగా వరి, మిర్చి, మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేశారు.
సమస్యలపై ఇంజనీర్‌కు వినతి
గత నెల 11వ తేదిన తుంగభద్ర సలహా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అన్ని కాలువలకు 90 రోజుల పాటు అంటే నవంబర్ 21వ తేదీ వరకు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే డ్యాంలో ఇన్‌ఫ్లో పూర్తిగా పడిపోవడంతో ఉన్న నీటినే రోజూ విడుదల చేస్తున్నారు. డ్యాంలో నీటి నిల్వ తగ్గిపోతుండటంతో ఆదివారం తుంగభద్ర రైతు సంఘం అధ్యక్షుడు దరూరు పురుషోత్తం గౌడ నేతృత్వంలో రైతులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పంటలు పూర్తి అయ్యే వరకు నీరు పొదుపుగా ఉపయోగించుకునేలా గట్టి చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కొప్పళ జిల్లా మునిరాబాద్‌లోని జలాశయం ప్రధాన ఇంజనీర్ మనోజ్ కుమార్‌ను కలిసి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారని తెలిపారు.
రోజు రోజుకు తగ్గుతున్న నీటి నిల్వ
పడిపోయిన ఇన్‌ఫ్లో
పంటలకు చివరి వరకూ నీరందేనా?


