నవ జంటకు నూరేళ్లు | - | Sakshi
Sakshi News home page

నవ జంటకు నూరేళ్లు

Sep 17 2026 12:08 AM | Updated on Sep 17 2026 12:08 AM

యాక్సిడెంటులో మృతి

తుమకూరు: గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో బైక్‌పై వెళ్తున్న నవ దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన శిరా తాలూకా ద్వారాళు వద్ద మంగళవారం జరిగింది. శిరా తాలూకా హుణసెకట్టె గ్రామానికి చెందిన దర్శన్‌ (22), భార్య ఉషారాణి (20), వీరికి పెళ్లి జరిగి నెలన్నర రోజులు అయింది. పని మీద వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన వాహనం ఢీకొని వెళ్లిపోయింది. కిందపడి తీవ్ర గాయాలతో దంపతులు మరణించారు. గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించాలని మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదులో కోరారు. నవజంట కాటికి చేరడంతో కన్నీరుమున్నీరుగా విలపించారు.

యువకుని అవయవదానం

యశవంతపుర: రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్‌కు గురైన యువకుడు పలువురికి కొత్త జీవితాన్నిచ్చాడు. ఈ ఘటన దక్షిణకన్నడ జిల్లా మంగళూరులో జరిగింది. ఆయెరెబెట్టకు చెందిన గోపాల, వేదావతి దంపతుల చిన్న కొడుకు వర్షిత్‌ కులాల్‌ (21) సోమవారం రాత్రి పని ముగించుకుని బైకుపై ఇంటికి వస్తుండగా, కిందపడడంతో తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో చికిత్సలు అందించారు. బ్రెయిన్‌డెడ్‌ అయ్యిందని, చికిత్స చేసినా ఫలితం లేదని వైద్యులు తల్లిదండ్రులకు తెలిపారు. వైద్యుల సూచనతో వర్షిత్‌ అవయవ దానం చేయడానికి కన్నవారు అంగీకరించారు. ఆయన దేహం నుంచి ముఖ్యమైన అవయవాలను సేకరించి అవసరమైన రోగుల కోసం జీరో ట్రాఫిక్‌లో పంపించారు. వర్షిత్‌ను, తల్లిదండ్రులను ప్రజలు అభినందిస్తున్నారు.

టూర్‌కి వెళ్లి.. లాడ్జిలో మృతి

యశవంతపుర: స్నేహితులతో టూర్‌కి వెళ్లిన యువతి అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన హాసన్‌ జిల్లా సకలేశపుర తాలూకా వళలహళ్లి కోడిగ గ్రామంలో జరిగింది. బెంగళూరు నాగసంద్రకు చెందిన వర్ష (25), శుక్రవారం ప్రియుడు రఘు, స్నేహితులతో కలిసి ట్రిప్‌కు వెళ్లింది. శని, ఆది, సోమవారం భైరవేశ్వర మజగహళ్లి ఫాల్స్‌తో పాటు అనేక ప్రాంతాలను వీక్షించారు. వళలహళ్లి కొడిగెలోని లాడ్జిలో దిగారు. మంగళవారం స్నానానికి వెళ్లిన సమయంలో వర్ష కుప్పకూలిపోయిందని, తాము ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారని రఘు చెబుతున్నాడు. సకలేశపుర గ్రామాంతర పోలీసులు లాడ్జిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.

ఎమ్మెల్యేతో చిందులు.. ఇద్దరు ఖాకీల బదిలీ

శివమొగ్గ: గణేష్‌ విగ్రహ ఊరేగింపులో ఎమ్మెల్యే చెన్నబసప్పను భుజాలపైకెత్తుకుని చిందులేసిన ఇద్దరు ట్రాఫిక్‌ పోలీసు కానిస్టేబుళ్ల వీడియో వైరలైంది. వివరాలు.. శివమొగ్గ నగరంలోని తూర్పు ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో గణేష్‌ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ విగ్రహాన్ని తుంగా నదిలో నిమజ్జనానికి ముందు ఊరేగింపు చేపట్టారు. భీమేశ్వర గుడి సమీపంలో ఎమ్మెల్యే చెన్నబసప్పను ఇద్దరు ట్రాఫిక్‌ పోలీసులు సంతోషంలో ఎమ్మెల్యేను తమ భుజాలపైకెత్తుకుని చిందులు వేశారు. ప్రవర్తన సరిగా లేదంటూ ఎస్పీ ఆ కానిస్టేబుళ్లను వేరే వేరే పోలీసు స్టేషన్లకు బదిలీ చేశారు.

ఫ్రిడ్జ్‌ పేలుడులో తండ్రీ కొడుకు మృతి

బనశంకరి: బెళగావి సిటీ చవ్హాటి గల్లీలోని ఇంట్లో సోమవారం అర్ధరాత్రి సంభవించిన ఫ్రిడ్జ్‌ పేలుడులో తీవ్రంగా గాయపడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి గజానన రాజారామ దమాన (65), కుమారుడు రోషన్‌ (21) బుధవారం మరణించారు. తీవ్ర గాయాలు కావడంతో కోలుకోలేకపోయారు. పేలుడులోనే గజానన భార్య, ఇద్దరు కూతుళ్లు, సోదరి చనిపోవడం తెలిసిందే. మొత్తం మరణాలు 6కు పెరిగాయి. పెంపుడు పిల్లి కూడా కన్నుమూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement