ఆదివారం ప్యాలెస్ ఆవరణలో గజరాజులు
నడక సాధనకు బయల్దేరిన గజం
మైసూరు: నాడహబ్బ మైసూరు దసరా మహోత్సవంలో పాల్గొనేందుకు అడవుల్లోని శిబిరాల నుంచి రాచ నగరానికి చేరుకున్న దసరా గజరాజులకు మంచి ఆతిథ్యం లభిస్తోంది. సిటీ లైఫ్‌ని ఏనుగులు చవి చూస్తున్నాయి. రోజూ ప్రభుత్వ లాంఛనాలతో కూడిన ఆహారం అందిస్తూ ఉత్సవాల కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధం చేస్తున్నారు. 9 ఏనుగులు మైసూరు ప్యాలెస్ ఆవరణలో మకాం వేశాయి. పొద్దున్నే మావటీలు వాటికి స్నానాలు చేయించి ఆహారం అందిస్తున్నారు. అటవీ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రాజభవనం నుంచి ఆయుర్వేద కళాశాల సర్కిల్ వరకు నడక సాధన చేస్తున్నాయి.
మొదట కూరగాయల మెను
అటవీ అధికారి ఎస్.ఎస్.రవిశంకర్ మాట్లాడుతూ, ఏనుగులకు ఏమేం ఆహారం ఇస్తున్నదీ వివరించారు. మర్రిచెట్లు కొమ్మలు, గడ్డి, ముల్లంగి, క్యారెట్, బీట్‌రూట్ వంటి పీచుపదార్థం అధికంగా ఉండే కూరగాయలను తినిపిస్తున్నట్లు చెప్పారు. పశువైద్య అధికారుల సూచనల ప్రకారం ఏనుగుల జీర్ణక్రియకు ఆటంకం కలగకుండా, మితమైన మోతాదులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాన్ని అందిస్తున్నారు.
త్వరలో ధాన్యాల తిండి
మొదటి దశ శిక్షణ పూర్తయిన తర్వాత, ఏనుగులకు ప్రత్యేకమైన ఆహారాన్ని ఇస్తారు. శనగపిండి, మినపపప్పు, గోధుమలు, కుసుబల బియ్యం, ఉప్పు కలిపిన ఉల్లిపాయలు తినిపిస్తారు. ముల్లంగి, క్యారెట్, బీట్‌రూట్, దోసకాయ వంటి కూరగాయల సలాడ్ కూడా అందిస్తారు. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఇదే మెను ఇస్తారు, ఏనుగులు కూడా దీనిని చాలా ఇష్టంగా తింటాయి.
త్వరలో అభిమన్యు రాక
దసరా ఏనుగుల రెండవ విడత బృందం మైసూరుకు చేరుకోనుంది. ఇందులో ప్రముఖ ఏనుగు కెప్టెన్ అభిమన్యు కూడా ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. ఆ ఏనుగు వల్ల మిగతా ఏనుగులకు కాస్త ధీమా ఏర్పడుతుంది.
మైసూరులో నిత్యం ఏనుగుల సందడి
నడక సాధనకు విశేష స్పందన
అతిథులకు ఆరోగ్యకర మెనూ
మిన్నంటిన సందడి
ఇక ఏనుగులను చూడటానికి వచ్చే ప్రజలు, టూరిస్టులు రోజురోజుకు పెరుగుతున్నారు. ఏనుగుల ప్రశాంతతకు భంగం కలిగించరాదని వారిని అధికారులు కోరుతున్నారు. ప్రజలు గజరాజుల పట్ల ప్రేమగా ప్రవర్తించాలని, ఆటంకం కలిగించరాదని విజ్ఞప్తి చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, పెద్దసంఖ్యలో అటవీ, పోలీసు సిబ్బంది ఏనుగుల వద్ద ఉంటున్నారు. ఆదివారం భారీ జన కోలాహలం మధ్య నడక సాధన చేశాయి.


