బైక్‌లకు దుండగుల నిప్పు | - | Sakshi
Sakshi News home page

బైక్‌లకు దుండగుల నిప్పు

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

దొడ్డబళ్లాపురం: ఇంటి ముందు నిలిపిన ఐదు బైక్‌లకు దుండగులు నిప్పంటించిన సంఘటన బెంగళూరు పరప్పన అగ్రహార ఠాణా పరిధిలో జరిగింది. దొడ్డనాగమంగల దగ్గర కేంబ్రిడ్జ్‌ పాఠశాల వద్ద ఉన్న ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న ఐదు ఖరీదైన బైక్‌లకు శనివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించారు. దీంతో అవన్నీ పూర్తిగా దహనం కావడంతో పాటు ఆ ఇంటి కిటికీలు, తలుపులు కూడా కాలిపోయాయి. ఆధారాలను బట్టి కావాలనే నిప్పంటించారని పోలీసులు అనుమానిస్తున్నారు.

కలబుర్గిలో దొంగనోట్ల ముఠా

దొడ్డబళ్లాపురం: హోంమంత్రి ప్రియాంక్‌ ఖర్గే సొంత జిల్లా కలబుర్గిలో దొంగనోట్ల ముఠా గుట్టు రట్టయింది. వివరాలు.. కలబుర్గిలోని రాజరాజేశ్వరి నగరలో ఓ ఇంట్లో దొంగనోట్లు ముద్రిస్తున్నారని సమాచారం అందడంతో యూనివర్సిటీ ఠాణా పోలీసులు దాడులు చేశారు. అశ్విన్‌ అనే నిందితుడు పరారవగా దశరథ్‌ రాథోడ్‌, సిద్దరామ అనే ఇద్దరు పట్టుబడ్డారు. నిందితులు అద్దె ఇల్లు తీసుకుని నోట్ల ముద్రణను ప్రారంభించారు. అక్కడ కలర్‌ ప్రింటర్‌తో పాటు రూ.14వేల విలువగల దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పులు ఎక్కువవడంతో తీర్చడానికి ఈ దందాకు దిగినట్టు నిందితులు తెలిపారు. అయితే నోట్లు సరిగా ప్రింటింగ్‌ కాకపోవడంతో వాటిని చలామణి చేయలేకపోయారు. చాలా నోట్లను కాల్చివేసినట్టు తెలిసింది.

మిమ్మల్ని క్షమించేది లేదు

నిందితులపై రమ్య కాఠిన్యం

యశవంతపుర: అందాల నటి, మాజీ ఎంపీ రమ్య అలియాస్‌ దివ్య స్పందన అసభ్య కామెంట్ల కేసులో తగ్గేదే లేదని చెప్పారు. గతంలో దర్శన్‌ అభిమానులపై పెట్టిన అశ్లీల సందేశాల కేసును వాపస్‌ తీసుకోబోనని రమ్య తెలిపారు. బెంగళూరులో కోర్టు ఆవరణలో నిందితుల కుటుంబసభ్యులు రమ్యను కలిసి క్షమించి, కేసు వాపస్‌ తీసుకోవాలని వేడుకున్నారు. కానీ రమ్య ససేమిరా అన్నారు. ఈ కేసు అందరికీ గుణపాఠం కావాలని రమ్య చెప్పినట్లు తెలిసింది. మొబైల్‌ఫోన్‌ ఉందని ఓ మహిళను ఎలా కావాలంటే అలా కామెంట్‌ చేయవచ్చా? అని రమ్య వారిని ప్రశ్నించారు. కామెంట్‌ చేయడానికి ముందు వెయ్యి సార్లు యోచన చేయాలని, కేసు నడవాలి, తానే గెలపాలని, ఎన్నిసార్లు కోర్టు వాయిదాకు పిలిచినా వస్తానని ఆమె చెప్పారు. నిందితులను క్షమిస్తారా? అని జడ్జి కూడా ఆమెను విచారణలో అడిగినట్లు తెలిసింది.

గణేశ మండపాలకు

నిబంధనలు

బెంగళూరు పోలీసు కమిషనర్‌

బనశంకరి: బెంగళూరులో వినాయక చవితి మండపాల ఏర్పాటులో నిబంధనలను పాటించాలని పోలీస్‌ కమిషనర్‌ సీమంత్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ గణేశోత్సవానికి ఇతర శాఖల అనుమతి తప్పనిసరి అనుమతి తీసుకోవాలన్నారు. ఎలాంటి ఆదేశాలను ఉల్లంఘించరాదని తెలిపారు. సూచించిన మార్గంలోనే ఊరేగింపు నిర్వహించాలి, స్వయంసేవకుల జాబితా పోలీసులకు అందించాలన్నారు. మండపాలను, ఊరేగింపు మార్గాలను డీసీపీలు పరిశీలిస్తారు. నిబంధనల ఉల్లంఘన కనబడితే కఠినచర్యలు తీసుకుంటారని తెలిపారు. నగరంలో పీఓపీ విగ్రహాల తయారీ, విక్రయాలను, నిమజ్జనాన్ని నిషేధించామన్నారు. అధిక విగ్రహాలకు లోహమిశ్రమంతో కూడిన రసాయనిక రంగులు వాడకూడదన్నారు. చెరువులు, బావులతో పాటు ఎలాంటి జలమూలాల్లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement