సమానత్వం కోసం పోరాడుతూనే ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సమానత్వం కోసం పోరాడుతూనే ఉండాలి

Sep 7 2026 3:14 AM | Updated on Sep 7 2026 3:14 AM

బీసీ కులాలకు సిద్దరామయ్య పిలుపు

శివాజీనగర: ఈ దేశంలో ఒకనాటికి సమానత్వంతో కూడిన సమాజం ఏర్పడుతుందని నాకు గట్టి నమ్మకం ఉంది. మనం కుల వ్యవస్థ ఉన్నంత కాలం పోరాటం కొనసాగాలి అని కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. కుల సర్వే నివేదికలోని సిఫార్సులను అమలు చేయాలని డీ.కే.శివకుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం బెంగళూరు ప్యాలెస్‌ మైదానంలో రాష్ట్ర బీసీ కులసంఘాలు నిర్వహించిన రజతోత్సవ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2013లో తాను ఎంతో తపించి కుల సర్వే చేయించానని, తరువాత సీఎం అయిన హెచ్‌డీ కుమారస్వామి ఆ నివేదికను అంగీకరించలేదని ఆయన చెప్పారు. అందరికీ సామాజిక న్యాయం కావాలంటే, కనీసం 75 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఎన్నికల వ్యవస్థను సంస్కరించాలి

నేను రాజకీయాల్లో కొనసాగుతా, కేవలం ఎన్నికల నుంచే విరమిస్తాను, మన ఎన్నికల వ్యవస్థ చాలా ఖరీదైనదిగా మారింది, దీనిని సంస్కరించాలి అని సిద్దరామయ్య అన్నారు. ఎన్నికల వ్యవస్థ చాలా అధ్వాన్నంగా ఉన్నందున నేను పోటీ చేయనని తెలిపారు. మీతో ఉండి పోరాటంలో పాల్గొంటానని చెప్పారు. ఈ సభలో డీసీఎం పరమేశ్వర్‌, మంత్రులు సంతోష్‌ లాడ్‌, పుట్టరంగశెట్టి, భైరతి సురేష్‌, మధు బంగారప్ప, అజయ్‌ సింగ్‌, ఎమ్మెల్యేలు బసవరాజ శివణ్ణనవర్‌, భీమసేన చిమ్మనకట్టి, ఉమేశ్‌ మేటి, పలువురు ఎమ్మెల్సీలు, బోర్డుల అధ్యక్షులు పాల్గొన్నారు.

సొసైటీలో భారీ స్కాం..

సీఈఓ అదృశ్యం

శివమొగ్గ: జిల్లాలోని హొసనగర తాలూకా, రిప్పన్‌పేట సమీపంలో హెడ్డరిపుర గ్రామ పంచాయతీ పరిధిలోని జంబళ్లి వద్ద దట్టమైన అడవిలో స్విఫ్ట్‌ కారు నిలిపి ఉంది. ప్రజలు పరిశీలన చేయగా, ఆ కారు కుడుమల్లిగే సొసైటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) మదన్‌దని తెలిసింది. కారులోనే తాళాలు, ఆయన మొబైల్‌ ఫోన్‌, సొసైటీ ఖాతా పుస్తకాలు లభ్యం కావడం ఘటన తీవ్రతను మరింత పెంచింది. ఈ సొసైటీలో భారీఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మలూరు పోలీస్‌ స్టేషన్‌లో ఒక ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో మదన్‌ అదృశ్యమయ్యారు. ఆయన శుక్రవారం తీర్థహళ్లిలోని ఇంటి నుంచి బయలుదేరాడని సంబంధీకులు తెలిపారు. కారును నిలిపి ఎక్కడికి వెళ్లాడనేది మిస్టరీగా ఉంది. కారు లభ్యమైన జంబళ్లి అటవీ ప్రాంతంలో మదన్‌ కుటుంబసభ్యులు, స్థానిక ప్రజలు గాలిస్తున్నారు. పోలీసులు కూడా వెతుకులాట ప్రారంభించారు.

టెక్కీకి చావుదెబ్బలు

బెంగళూరులో దురాగతం

కృష్ణరాజపురం: బెంగళూరులో చిన్న విషయానికే ఐటీ ఇంజనీరును బార్బర్‌షాపు యజమాని చావుదెబ్బలు కొట్టాడు. వివరాలు.. కృష్ణరాజపురంలో టెక్కీ టెరెన్స్‌ సందీప్‌ను నిందితుడు మునిరాజు కిరాతకంగా చావబాదాడు. శీగేహళ్లిలో పక్క భవనంలో కటింగ్‌ షాప్‌ నడుపుతున్న మునిరాజు, టెక్కీ నివసించే ఇంటి గోడకు నిత్యం మూత్రవిసర్జన చేసేవాడు. ఇది సభ్యత కాదని టెక్కీ అతనికి సూచించాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన మునిరాజు వాగ్వాదానికి దిగి టెక్కీ ముఖంపై ముష్టిఘాతమిచ్చాడు. అతడు పడిపోగా తీవ్రంగా కొడుతూ రోడ్డు మీదకు లాక్కొచ్చాడు. అక్కడ కూడా కాళ్లు చేతులతో కొడుతూ రాక్షసంగా ప్రవర్తించాడు. టెక్కీకి ఓ కన్ను దెబ్బతినడంతో పాటు ముఖంపై తీవ్ర రక్తగాయాలయ్యాయి. ఇది సెప్టెంబర్‌ 5వ తేదీన, సాయంత్రం సుమారు 6:55 గంటలకు జరిగింది. అక్కడి సీసీ కెమెరాలలో రికార్డయింది. కేఆర్‌ పుర పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement