సాక్షి బెంగళూరు: సీఎం డీకే శివకుమార్ ఆధ్వర్యంలో జరిగిన సీఎల్పీ భేటీకి మాజీ సీఎం సిద్ధరామయ్య గైర్హాజరయ్యారు. మంగళవారం రాత్రి బెంగళూరులోని ఒక పంచతారా హోటల్‌లో సీఎం డీకే నేతృత్వంలో సీఎల్పీ సమావేశం జరిగింది. సిద్దరామయ్యతో పాటు ఆయన మద్దతుదారులు కొందరు పాల్గొనలేదు. కేబినెట్‌లో చోటు దక్కని ఎమ్మెల్యేలు హెచ్‌సీ మహదేవప్ప, శివానంద పాటిల్, ఎం.కృష్ణప్ప, ఆయన కుమారుడు ప్రియకృష్ణ, ఎంసీ సుధాకర్, ఎస్‌ఎన్ నారాయణ స్వామి, కొత్తనూరు మంజునాథ్ కూడా రాలేదు. సిద్ధరామయ్య తనయుడు, మంత్రి యతీంద్ర సైతం ఆలస్యగా రావడం గమనార్హం. సీఎం పదవి నుంచి రాజీనామా చేయించారని, మంత్రిమండలి ఏర్పాటులో తన మాట చెల్లలేదని సిద్దు గుర్రుగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ సమావేశాలతో పాటు పార్టీ కార్యక్రమాలతో అంటీముట్టనట్లుగా ఉండడం ప్రచారాంశమైంది.


