అసెంబ్లీలో అదే గడబిడ | - | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో అదే గడబిడ

Aug 20 2026 3:40 AM | Updated on Aug 20 2026 3:40 AM

సాక్షి, బెంగళూరు: నూతన మంత్రి బి.నాగేంద్ర రాజీనామా చేయాల్సిందేనని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌ తమ ఆందోళనను ఉధృతం చేశాయి. బుధవారం విధానసౌధలోని కెంగల్‌ గేట్‌ ముందు ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. నాగేంద్ర వల్ల దళితులకు అన్యాయం జరిగిందని ప్లకార్డులు ప్రదర్శించారు. బీజేపీ పక్ష నేత ఆర్‌.అశోక్‌ మాట్లాడుతూ దళితుల నిధులను 600 అకౌంట్లకు నాగేంద్ర, ఆయన కుటుంబం, బంధువులు బదిలీ చేసుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బులను బళ్లారి లోక్‌సభ ఎన్నికలకు బదలాయించారని ఆరోపించారు. నాగేంద్ర రాజీనామా చేస్తే రాష్ట్ర సమస్యలు అయిన బిడది, నైస్‌ కుంభకోణం, కరువు, కేపీఎస్సీపై చర్చిస్తామని తెలిపారు.

నాగేంద్ర నిందితుడు కాదు: డీసీఎం

బనశంకరి: రూ.79 కోట్ల వాల్మీకి అభివృద్ధి మండలి కుంభకోణంలో మంత్రి నాగేంద్ర నిందితుడు కాదని డీసీఎం పరమేశ్వర్‌ అన్నారు. విధానసభలో విపక్షాల ఆరోపణలకు ఆయన ప్రభుత్వం తరఫున సమాధానమిచ్చారు. విపక్షాలు సభ జరగకుండా అడ్డుపడుతున్నాయన్నారు. ప్రజల సమస్యలపై చర్చించాలి, అడ్డు తగలడం రాజ్యాంగ ఉల్లంఘన అని అన్నారు.

పరిషత్‌లో రచ్చ, వాయిదా

బనశంకరి: వాల్మీకి మండలి అక్రమాల కేసులో మంత్రి బీ.నాగేంద్ర రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తుండడంతో అసెంబ్లీ సమావేశాలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. బుధవారం విధాన పరిషత్‌లో మాజీ మంత్రి నాగేశ్‌ మృతికి నివాళులు అర్పించారు. ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్సీలు నాగేంద్ర రాజీనామా చేయాలని సభలో పట్టుబట్టారు. గందరగోళం వల్ల మూడు రోజులు వృథా అయిందని, చర్చలు జరగనివ్వాలని సభాపతి సలీం అహ్మద్‌ కోరారు. కరువు, తాగునీటి సమస్య, పశువులకు మేత కొరత తదితరాలపై చర్చించాలన్నారు. ఏమి చర్చిస్తారా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ప్రభుత్వం తమ డిమాండును పరిష్కరించాలని బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. చివరకు సభ వాయిదా పడింది.

ఎందుకు రాజీనామా చేయాలి: నాగేంద్ర

బనశంకరి: అసెంబ్లీలో ప్రతిపక్షాలు తన రాజీనామాకు పట్టుబట్టడంపై మంత్రి బీ.నాగేంద్ర స్పందిస్తూ నేను ఎందుకు రాజీనామా చేయాలి అని ప్రశ్నించారు. విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ ఎస్టీ వర్గానికి చెందిన తాను మంత్రి కావడాన్ని ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయన్నారు. వాల్మీకి మండలిలో బ్యాంకులకు నిధులు బదిలీ అవుతాయని, రూ.187 కోట్లు బోర్డు మీటింగ్‌ లేకుండా, అధ్యక్షుని దృష్టికి తీసుకురాకుండా బదిలీ అవుతుందా?, మండలికి అధ్యక్షుడు ఉండగా నేను పట్టించుకోలేదు అని చెప్పారు. ఓ అధికారి ఆత్మహత్య తరువాతే ఈ విషయం తనకు తెలిసిందన్నారు. దేశంలో 126 మంది బీజేపీ సభ్యులపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయని, వారి రాజీనామా ఎందుకు అడగలేదని ధ్వజమెత్తారు.

మంత్రి నాగేంద్ర రాజీనామాకు

ప్రతిపక్షాల పట్టు

సాగని కార్యకలాపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement