విఠలునికి తులసి సేవ | - | Sakshi
Sakshi News home page

విఠలునికి తులసి సేవ

Aug 20 2026 3:40 AM | Updated on Aug 20 2026 3:40 AM

బొమ్మనహళ్లి: దేవుడు సర్వోన్నతుడు. దేవుడు ప్రతిదానిలోనూ ఉన్నాడు. మనం చేసే ప్రతి పనిలోనూ దైవస్మరణ ఉండాలి. మనం ఏమీ ఆశించకుండా దైనందిన విధులను నిర్వర్తిస్తూ, స్వచ్ఛమైన భక్తితో దేవుడిని ప్రార్థించినప్పుడు, సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతాము అని హిరియడ్క నెక్కర్‌ పాల్కేయ సీతారామ ఆచార్యులు అన్నారు. ఉడుపి జిల్లాలోని హీబ్రూ సమీపంలోని ముద్రాడి గ్రామంలో విఠల స్వామి ఆలయంలో లక్ష తులసి అర్చనను ఘనంగా నిర్వహించారు. విప్ర సమాజం ఆధ్వర్యంలో పూజలు జరిగాయి.

కేఎంఎఫ్‌ ఉద్యోగి

రూ.60 లక్షల స్వాహా

మైసూరు: కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ (కేఎంఎఫ్‌) మైసూరు శిక్షణా కేంద్రంలోని ఆఫీస్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌–1)గా పనిచేస్తున్న రాజశేఖర్‌, రూ.60 లక్షలను దశలవారీగా తన ఖాతాలోకి బదిలీ చేసుకుని సంస్థకే టోపీ వేశాడు. అతని ఖాతాలోకి భారీగా డబ్బు పడుతుండడంతో కెనరా బ్యాంక్‌ అధికారులు, బెంగళూరులోని కేఎంఎఫ్‌ కార్యాలయానికి తెలియజేశారు. దీంతో కేఎంఎఫ్‌ ఉన్నతాధికారులు విచారణ జరిపారు. సంస్థ పనుల కోసం ఆర్థిక శాఖ నుంచి లావాదేవీలు జరిపేందుకు ఆఫీస్‌ అసిస్టెంట్లకు అనుమతులున్నాయి. వారి మొబైల్‌ఫోన్లకు ఓటీపీలు వస్తాయి. ఈ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నిధులను స్వాహా చేయసాగాడు. కాగా అతనిని సస్పెండ్‌ చేసి, మైసూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టారు. డబ్బు రికవరీ చేశారా, లేదా అనేది తెలియాల్సి ఉంది.

రిసార్టులో జింక కొమ్ముల డంప్‌

మైసూరు: చామరాజనగర జిల్లాలోని గుండ్లుపేట తాలూకాలోని కెబ్బేపూర్‌ గ్రామంలోని ఓ హోం స్టేలో అక్రమంగా దాచిన జింక తల, 48 కొమ్ములు, చర్మం, నెమలి ఈకలు, తుపాకీ, రివాల్వర్‌తో సహా 17 రకాల వస్తువులను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక రైతులు ఇచ్చిన సమాచారం ప్రకారం దాడులు జరిపారు. వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన కంచెలను తొలగించి స్వాధీనం చేసుకున్నామని, ఒక నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. తుపాకులకు లైసెన్స్‌ ఉందా, లేదా అనేది పరిశీలిస్తున్నట్లు జి.ఎస్‌. బెట్ట రేంజ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కె.పి.సతీష్‌కుమార్‌ తెలిపారు. బండీపుర అంచున ఉన్న రిసార్ట్‌లు, హోం స్టేలలో అక్రమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకోవాలని రైతుసంఘాలు కోరాయి.

ప్రజ్వల్‌కు మాజీ ఖైదీ ద్వారా మొబైల్‌

యశవంతపుర: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్‌ జైల్లో ఖైదీ, మాజీ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణకు మొబైల్‌ఫోన్‌ను అందించిన బాణసవాడికి చెందిన నవీన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. నిందితుడు జైల్లో ఉన్న మిత్రునికి మొబైల్‌ ఇచ్చి, దానిని ప్రజ్వల్‌కు ఇవ్వాలని సూచించాడు. నవీన్‌ ఒక కేసులో జైలుకెళ్లాడు. ప్రజ్వల్‌రేవణ్ణ జతలో ఉన్న ప్రతాప్‌ రాయ్‌ పరిచయమయ్యాడు. విడుదలైన తరువాత ప్రతాప్‌రాయ్‌కు నవీన్‌ గుట్టుగా ఫోన్‌ను పంపించాడని విచారణలో బయట పడింది. ఇందుకోసం ప్రజ్వల్‌ అతనికి కొంత డబ్బులు ఇచ్చాడు. ఇటీవల జైల్లో పోలీసుల తనిఖీలలో ప్రజ్వల్‌ వద్ద స్మార్ట్‌ ఫోన్‌ దొరకడం తెలిసింది.

కేపీఎస్‌సీ అభ్యర్థి ఇంట్లో

ఈడీ సోదాలు

గౌరిబిదనూరు: ఈ ఏడాది జనవరిలో కేపీఎస్‌సీ నిర్వహించిన 400 పశువైద్యాధికారుల పోస్టుల్లో అవినీతి అక్రమాలపై ఈడీ దాడులు చేపట్టడం తెలిసిందే. అభ్యర్థుల ఇళ్ళలోనూ సోదాలు చేస్తున్నారు. ఆ పరీక్షల్లో రాష్ట్రంలో 22వ ర్యాంకుతో ఉద్యోగం పొందిన స్థానిక కరేకల్లహళ్ళికు చెందిన రామకృష్ణప్ప కుమారుడు లోకేశ్‌ ఇంటిలోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. బందోబస్తుతో వచ్చిన అధికారులు పలు దాఖలాలను స్వాధీనం చేసుకుని, కుటుంబీకులను ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement