రాయచూరు రూరల్: నగరంలో గురువారం ఫెడరల్ బ్యాంక్ వద్ద బ్యాంక్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆందోళననుద్దేశించి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ సంచాలకుడు సంతోష్ మాట్లాడారు. బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల విధుల నిర్వహణకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నేడు డిజిటల్ పద్ధతి రావడంతో డిజిటల్, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, యూపీఐలు ఉండడం వల్ల బ్యాంక్ ఉద్యోగులకు ఇతర పనుల ఒత్తిళ్లతో ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.
ఇళ్ల మంజూరు కోసం ధర్నా
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ పథకంలో వెనుక బడిన వర్గాల సంక్షేమ శాఖ నుంచి మురికి వాడల ప్రజలకు ఇళ్లు మంజూరు చేయాలని దళిత సమర సేన డిమాండ్ చేసింది. గురువారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు నరసింహులు మాట్లాడారు. వీధి వ్యాపారులు, కుష్టు రోగులు, దివ్యాంగులు, సఫాయి కర్మచారులు, దేవదాసి మహిళలు, వితంతువులు, పేదలు ఇళ్లు నిర్మించుకోవచ్చన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ అహోరాత్రి ఆందోళనకు పూనుకున్నారు.
మొబైల్‌ను వీడాలి
హుబ్లీ: మొబైల్‌ను వీడి గ్రంథాలయం బాట పట్టాలని విద్యార్థులకు అళ్నావర ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ ఒక్కుంద పిలుపునిచ్చారు. ఆ పట్టణ ఫస్ట్ గ్రేడ్ కళాశాలలో జాతీయ గ్రంథ పాలకుల దినోత్సవంలో ఆయన మాట్లాడారు. పుస్తకాలు నిజమైన మార్గదర్శులు, గ్రంథాలయాలు జ్ఞాన కేంద్రాలని, ప్రతి ఒక్కరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిజిటల్ యుగంలో కూడా గ్రంథాలయాల ప్రాధాన్యత తగ్గలేదు. పుస్తకాల ద్వారా జ్ఞానార్జనకు ప్రేరణనిచ్చే గ్రంథ పాలకుల సేవ స్మరించడం ఈ రోజు విశేషం అన్నారు. డాక్టర్ ఎస్‌ఆర్.రంగనాథన్ దేశ గ్రంథాలయాల ఎదుగుదలకు అనన్య సేవలు అందించారన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ భీమనగౌడ పాటిల్ మాట్లాడుతూ పోటీ పరీక్షల తయారీలో గ్రంథాలయాల పాత్ర అనే అంశంపై ప్రత్యేక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయ మంజుల, ప్రముఖులు డాక్టర్ సురేష్, దీపా, రంజన్ తదితరులు పాల్గొన్నారు.


