బనశంకరి: కూలీలు పనుల్లో ఉండగా పై నుంచి పెద్దమొత్తంలో మట్టి విరిగి పడడంతో సజీవ సమాధి అయ్యారు. బెంగళూరు నగరంలోని కంఠీరవ స్టూడియో ముందు భాగంలో అండర్‌పాస్ నిర్మాణం కోసం తవ్వుతున్న భారీ గుంత ఓ వైపు కూలడంతో ఇద్దరు కార్మికులు మట్టిదిబ్బల్లో చిక్కుకుని మరణించారు. ఎఫ్‌టీఐ సర్కిల్ వద్ద అండర్‌పాస్ కోసం సుమారు 20 అడుగుల లోతు, అంతకంటే ఎక్కువ వెడల్పుతో గొయ్యిని తవ్వుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆరేడు మంది కార్మికులు మట్టి తవ్వే పనుల్లో ఉండగా, ఓ వైపు మట్టి కూలి వారి మీద పడిపోయింది. ఐదుమంది కార్మికులు చిక్కుకుపోయారు. ఫైర్ సిబ్బంది, నందినీలేఔట్ పోలీసులు చేరుకుని మట్టిని తీసి సదానంద్, సునీల్, ఇర్మియాజ్ అనే కూలీలను బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. సోనారామ్ (26), పరిమళ్ (31) అనే కూలీలు మట్టిలో చిక్కుకుని ఊపిరొదిలారు. ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా? అని గాలిస్తున్నారు.
విరిగిపడ్డ అండర్‌పాస్ గుంత మట్టి
బెంగళూరు కంఠీరవ స్టూడియో వద్ద ప్రమాదం
ఇద్దరు మృతి, ముగ్గురికి విషమం
అధికారుల నిర్లక్ష్యమే: ఎమ్మెల్యే
జీబీఏ అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణమని ఎమ్మెల్యే కే.గోపాలయ్య మండిపడ్డారు. ఘటనాస్థలిని పరిశీలించి మాట్లాడుతూ ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారని, మరో ఇద్దరు లోపలే చిక్కుబడినట్లు తెలుస్తోందన్నారు. గాయపడిన ముగ్గురిని మణిపాల్ ఆసుపత్రిలో చేర్చినట్లు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు బలి అవుతున్నారని, వర్షాకాలం సమయంలో ఇలాంటి భారీ అండర్‌పాస్ పనులు ఎవరైనా చేస్తారా? అని ప్రశ్నించారు. ఇది చిన్న డ్రైనేజీ పనికాదని, నిలిచిన వాననీటిని తొలగించినప్పుడు ఈ దుర్ఘటన సంభవించిందని తెలిపారు. ఈ పనులు నిలిచిపోతే తన ఒత్తిడితో 2023 నుంచి మళ్లీ ప్రారంభించారని చెప్పారు.


