మనకే నీళ్లు లేకుంటే.. ఎలా? | - | Sakshi
Sakshi News home page

మనకే నీళ్లు లేకుంటే.. ఎలా?

Aug 12 2026 12:52 AM | Updated on Aug 12 2026 12:52 AM

మండ్య: కావేరి నదిపైనున్న జలాశయాల నుంచి తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 12 వేల క్యూసెక్కుల చొప్పున 16 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కావేరీ కమిటీ ఇచ్చిన ఆదేశాలపై నగరంలో రైతులు, వివిధ సంఘాల కార్యకర్తలు రోడ్లపైకొచ్చారు. జయ చామరాజేంద్ర ఒడెయార్‌ సర్కిల్‌లో హైవే ట్రాఫిక్‌ను నిలిపివేశారు. కావేరి జల కమిటీలు, తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కావేరీ పరివాహక ప్రాంతాల్లో పొలాలకు నీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయాయి, ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గత కొన్ని రోజులుగా కేరళ, కొడగు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఎంతో కొంత ప్రవాహం పెరిగింది, ఆ వానలు కూడా తగ్గాయి, వర్షాలు కురుస్తాయనే అంచనాలు కూడా లేవు, ఈ పరిస్థితుల్లో తమిళనాడుకు ఎలా నీటిని విడుదల చేయగలరు? అని రైతు నేతలు ప్రశ్నించారు.

కేఆర్‌ఎస్‌లో 30 టీఎంసీలే

కేఆర్‌ఎస్‌ డ్యాంలో సుమారు 30 టీఎంసీలు మాత్రమే నీరుందని, ఇందులో 16 టీఎంసీలను తమిళనాడుకు విడుదల చేస్తే, మా రైతుల పంటలకు నీరు వద్దా? అని రైతునేతలు మండిపడ్డారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, జలవనరుల శాఖ మంత్రి రామలింగారెడ్డి, అధికారుల్లో కనీస ఆందోళన కూడా లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పొలాలకు ఎంత నీరు కావాలో, తాగునీటికి ఎంత అవసరమో అనే గణాంకాలను కావేరీ జల కమిటీ ముందు ఉంచడంలో వారు విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రతిసారీ ప్రాణాంతకమైన ఉత్తర్వులు అందుతున్నాయని వాపోయారు. తమిళనాడుకు నీరు అందించరాదని రైతులు నేతలు స్పష్టంచేశారు. ఒకవేళ వదిలితే.. ప్రజలు, రైతులు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తారని హెచ్చరించారు.

మండ్యలో రైతు నేతల ధర్నా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement