ఘనంగా మారెమ్మ జాతర | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మారెమ్మ జాతర

Aug 12 2026 12:52 AM | Updated on Aug 12 2026 12:52 AM

బొమ్మనహళ్లి: హాసన్‌ జిల్లాలోని హిరిసావెలో మంగళవారం మారెమ్మ దేవి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేప చెట్టు దగ్గర మారెమ్మ దేవి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి, జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మాదిగ సముదాయానికి చెందిన 40 కుటుంబాలవారు అమ్మవారి హారతిని తలపై మోస్తూ ఊరేగించారు. గతంలో ఏటా మేము తుమకూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో ఉన్న మా గ్రామాలకు వెళ్లి పండుగను జరిపేవారమని, ఇప్పుడు ఇక్కడే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సౌధ ముందు స్వరాజ్య హబ్బ

బనశంకరి: ఆగస్టు 15న నగరంలో విధానసౌధ ఆవరణలో ఫ్రీడం హబ్బకు ఏర్పాట్లు సాగుతున్నాయి. రాష్ట్రస్థాయిలో స్వాతంత్య్ర ఉత్సవాలను ఇక్కడ తొలిసారి జరపబోతున్నారు. ఈ సందర్భంగా బాలలు, వారి తల్లిదండ్రులు విధానసౌధలోనికి వెళ్లి అక్కడి వాస్తుశిల్ప వైభవాన్ని కూడా వీక్షించడానికి అనుమతిస్తారు. ఇందుకోసం పాస్‌లను అందిస్తారు. పిల్లల కోసం సౌధలో మక్కళమేళా, ఆటలు, కథలు, చేనేత హస్తకళలుతో పాటు కుటుంబ వినోద కార్యక్రమాలను ఆ రోజంతా నిర్వహిస్తామని మంత్రి కృష్ణబైరేగౌడ తెలిపారు. ఆరోజు విధానసౌధ సందర్శనను ప్రతి విద్యార్థి తమ జీవితంలో అపరూపమైన జ్ఞాపకంగా దాచుకోవాలనేది తమ ఆశయమన్నారు.

టూరిస్టు బస్సు ఢీ,

మహిళా ఉద్యోగిని మృతి

మైసూరు: టూరిస్ట్‌ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఓ మహిళ అక్కడికక్కడే మరణించిన ఘటన చామరాజనగర జిల్లా కొళ్లెగాల తాలూకాలోని మధువనహళ్లి వద్ద జరిగింది. మృతురాలు గ్రామ శివార్లలోని ఎస్‌వీఎస్‌ శీకాయపొడి ఫ్యాక్టరీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్న కొళ్లెగాలవాసి దాక్షాయణి (47). ఆమె టీవీఎస్‌ మోపెడ్‌లో ఇంటి నుంచి ఫ్యాక్టరీకి వెళుతుండగా ఘటనాస్థలిలో తమిళనాడు వైపు నుంచి వస్తున్న టూరిస్ట్‌ బస్సు ఢీకొని తీవ్ర గాయాలతో అక్కడే కన్నుమూసింది. డీఎస్పీ మోహన్‌, సీఐ రవీంద్ర, ఎస్‌ఐ సుప్రీత్‌ చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన బస్సును స్వాధీనపరచుకుని డ్రైవర్‌ను అరెస్టు చేశారు.

ప్రదోష్‌ అప్రూవర్‌ సాక్ష్యం వాయిదా

బనశంకరి: రేణుకాస్వామి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన 14వ నిందితుడు ప్రదోష్‌ సాక్ష్యం నమోదును ఒక వారం పాటు నిలిపివేయాలని 2వ నిందితుడు దర్శన్‌ తరఫు న్యాయవాదులు కోరగా, 59వ సీసీహెచ్‌కోర్టు సమ్మతించింది. ప్రదోష్‌ను అప్రూవర్‌గా పరిగణించే ముందు సహ నిందితుల వాదనలు ఆలకించాలని దర్శన్‌ వేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించారు. పరప్పన అగ్రహార జైలు నుంచి వీడియో కాన్పరెన్స్‌ ద్వారా దర్శన్‌, పవిత్రాగౌడ, ప్రదోష్‌ విచారణలో పాల్గొన్నారు. ప్రదోష్‌పై హత్య, కిడ్నాప్‌ అభియోగాలు ఉన్నాయని దర్శన్‌ వకీలు వాదించారు.

బెదిరింపుల వెనుక మహిళ?

రేణుకాస్వామి హత్యకేసులో 49వ సాక్షి సందీప్‌ను కొందరు దుండగులు ఇటీవల కిడ్నాప్‌ చేసి బెదిరించారనే ఘటన వెనుక ఓ ప్రముఖ మహిళ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. కిడ్నాపర్‌ పునీత్‌కు సదరు మహిళ ఫోన్‌ ద్వారా దిశా నిర్దేశం చేసిందని కాల్‌ డేటా రికార్డుల ద్వారా గుర్తించారు. ఈ కేసులో కామాక్షిపాళ్య పోలీసులు పునీత్‌, సుహాస్‌, వేణులను అరెస్ట్‌చేశారు. గౌరవ్‌శెట్టి, కిరణ్‌కు విచారణకు రావాలని నోటీసులిచ్చారు.

నమామి వాయుపుత్రా

శ్రీనివాసపురం: ముళబాగిలులోని పురాణ ప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి దేవాలయంలో పవిత్రోత్సవాల సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి సుప్రభాత సేవ, తదితర పూజలు కొనసాగాయి. మూల విరాట్టును విశేషంగా అలంకరించి అర్చించారు. ఆలయంలో ఉన్న వెంకటేశ్వరస్వామి, గోవిందరాజ స్వామి , వరద రాజస్వామి విగ్రహాలకు ప్రత్యేక అలంకారం, పూజలు జరిగాయి. ఎమ్మెల్యే సమృద్ధి మంజునాథ్‌తో పాటు వందలాది భక్తులు దర్శనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement