సేవే పరమార్థం, అవినీతి అమానుషం | - | Sakshi
Sakshi News home page

సేవే పరమార్థం, అవినీతి అమానుషం

Aug 12 2026 12:52 AM | Updated on Aug 12 2026 12:52 AM

బనశంకరి: ‘మనందరి ప్రధాన ఉద్దేశం ప్రజాసేవ. అందరూ కలిసి టీమ్‌ కర్ణాటక అనే లక్ష్యంతో ప్రజాసేవ చేద్దాం’ అని అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం డీకే.శివకుమార్‌ పిలుపునిచ్చారు. మంగళవారం విధానసౌధ బ్యాంక్వెట్‌ హాల్‌లో ప్రభుత్వ ఉద్యోగులతో నేరుగా, జిల్లాల ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఐదున్నర లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు 7 కోట్ల మంది ప్రజలకు సేవచేసే భాగ్యం దక్కిందన్నారు. అవినీతిని సహించేది లేదని, ఇందులో రాజీ ప్రశ్నే లేదన్నారు. అధికారులు, ఉద్యోగుల ప్రతి ఒక్కరి కదలికలపై తమకు సమాచారం ఉంటుందని, నిఘా వ్యవస్థ ఉందని తెలిపారు. మనిషి కడుపు నిండడానికి ఎంత తిండి అవసరమంటూ, అవినీతికి పాల్పడరాదని సూచించారు.

ప్రజా సమస్యలను తీర్చాలి

ప్రతి ఒక అధికారి, ఉద్యోగి పనిచేసే కేంద్ర స్థానంలో ఉండాలి, ప్రజా సమస్యల పట్ల స్పందించాలి. ప్రజలు కార్యాలయాలకు వచ్చినప్పుడు సకాలంలో పనులు చేయాలి, చట్టపరిధిలో విధులు నిర్వర్తించాలని సీఎం ఆదేశించారు. ఆలస్యం లేకుండా ప్రజలకు ప్రభుత్వ సౌలభ్యాలను అందించాలి, స్థానిక సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలి, వాయిదాలు వేయరాదని చెప్పారు. దేశంలో కర్ణాటక అగ్రస్థానంలో నిలిచిందని, మీ కష్టాన్ని మెచ్చుకుంటున్నానని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అద్యక్షుడైన షడక్షరి ఉద్యోగులకు గ్యారంటీ పథకాలు వద్దని చెప్పడం అభినందనీయమన్నారు. పేదలకు గ్యారంటీ పథకాలు సక్రమంగా అమలయ్యేలా మీరు పనిచేయాలని కోరారు. ఆఫీసులకు ప్రజలు, ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు గౌరవం ఇవ్వాలని తెలిపారు.

పల్లెల్లో యువ జోడో సంఘాలు

జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రులు నెలకు రెండుసార్లు తాలూకాలకు వెళ్లి ప్రజా సమస్యలను ఆలకించి పరిష్కారం చేయాలన్నారు. ప్రతి పంచాయతీలో భారత్‌ జోడో యువకుల సంఘాన్ని ఏర్పాటు చేస్తామని, యువతకు ఉపయోగకరంగా ఉంటుందని సీఎం తెలిపారు. గ్యారంటీ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయని, దానిని అరికట్టాలన్నారు. ఇంజనీర్లు బోగస్‌ బిల్లులు చేస్తున్నారు, అది మానేయాలని సూచించారు. కాగా, నూతన మంత్రులకు వెంటనే శాఖలు కేటాయిస్తామని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌, మంత్రులు, ఐఏఎస్‌లు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు

సీఎం డీకే హితబోధ

విధానసౌధలో సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement