వరద నీటితో నిండుకుండలా తొణికిసలాడుతున్న తుంగభద్ర డ్యాం
ఐసీసీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు, అధికారులు తదితరులు
కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న రైతు సంఘం నాయకులు
సాక్షి,బళ్లారి: ఎట్టకేలకు వరుణుడి కృపా కటాక్షాలతో తుంగభద్ర డ్యాంలోకి ఖరీఫ్ సీజన్‌లో పంటల సాగుకు సరిపడేంతగా 80 టీఎంసీలకు పైగా నీరు నిల్వ చేరడంతో తుంగభద్ర ఆయకట్టు పరిధిలోని లక్షలాది ఎకరాలకు ఖరీఫ్‌లో సాగు చేసే పంటలకు నీటిని విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని పలు జిల్లాలకు సాగు, తాగునీరందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాం నుంచి ఆయకట్టు పరిధిలో కర్ణాటక కోటా కింద నీటి విడుదలకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో మంత్రులు, అధికారులు ఈ మేరకు తీర్మానం తీసుకున్నారు. మంగళవారం కొప్పళ జిల్లా మునిరాబాద్ వద్ద నిర్వహించిన ఐసీసీ(నీటిపారుదల సలహా సమితి) ఆధ్వర్యంలో సంబంధిత మంత్రి శివరాజ్ తంగడిగి అధ్యక్షతన జరిగిన, మంత్రి నాగేంద్ర, ఎమ్మెల్యేలు గణేష్, రాఘవేంద్ర హిట్నాల్, అధికారులు, రైతు సంఘం నాయకులు దరూరు పురుషోత్తం గౌడ తదితరులు పాల్గొన్న సమావేశంలో కాలువలకు నీటి విడుదలకు సంబంధించిన అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. డ్యాంలో ప్రస్తుతం ఉన్న నీటి లభ్యత ఆధారంగా కాలువలకు ఏమేరకు నీరు విడుదల చేయాలన్న దానిపై స్పష్టత ఇచ్చారు.
కాలువలకు నీటి విడుదల వివరాలివే..
తాగునీటి అవసరాలకు నీటిని నిల్వ ఉంచుకుని డ్యాం నుంచి ఖరీఫ్ పంటల సాగుకు ఆయకట్టుకు నీరు విడుదల చేసేందుకు అన్ని విధాలుగా అనుమతులు ఇచ్చారు. ఐసీసీ సమావేశంలో ఈ మేరకు కాలువలకు నీరు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు. తుంగభద్ర ఎడమ గట్టు ప్రధాన కాలువ(ఎల్‌బీఎంసీ) కాలువకు ఆగస్టు 11వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు ప్రతి రోజు 4100 క్యూసెక్కుల చొప్పున 90 రోజుల పాటు నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. తుంగభఽద్ర కుడి గట్టు ప్రధాన కాలువ (హెచ్‌ఎల్‌సీ)కు కూడా నవంబర్ 10 వరకు 90 రోజుల పాటు ప్రతి రోజు 1200 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయాలని తీర్మానించారు. తుంగభద్ర కుడి గట్టు దిగువ కాలువ(ఎల్‌ఎల్‌సీ)కు నవంబర్ 10వ తేదీ వరకు ప్రతి రోజు 650 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయాలని నిర్ణయించారు. రాయబసవణ్ణ కాలువకు డిసెంబర్ 10 వరకు ప్రతి రోజు 180 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయాలని తీర్మానం చేశారు. నదీ పరివాహక ప్రాంతాలకు ఆగస్టు 17వ తేదీ వరకు ప్రతి రోజు 500 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
నీటి విడుదల కోసం రైతుల ధర్నా
ఈసారి ఖరీఫ్ సీజన్‌లో ఆయకట్టు రైతులకు పంటలు పూర్తిగా చేతికందే వరకు నీరు విడుదల చేయాలని, ఆమేరకు ఐసీసీ సమావేశంలో తీర్మానం చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మునిరాబాద్‌లో నిర్వహించిన ఐసీసీ సమావేశంలో కర్ణాటక ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి, ఏఐకేకేఎంఎస్ ప్రముఖులు గుర్రళ్లి రాజు తదితరులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన, ఆందోళన చేపట్టారు. వర్షాభావంతో ఖరీఫ్‌లో పంటలు సాగు చేయలేక పోయామన్నారు. ఇప్పటికే సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయన్నారు. ఇక తుంగభద్ర ఆయకట్టుపై మాత్రమే రైతులు నమ్ముకుని జీవిస్తున్నారన్నారు. ఈసారి తుంగభద్ర ఆయకట్టు రైతులకు పూర్తిస్థాయిలో నీరు విడుదల చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. డ్యాంలో నీరు వృథా చేయకుండా ఫ్యాక్టరీలకు అనవసరంగా నీరు విడుదల చేయకుండా రైతుల ప్రయోజనాల కోసం నీరు విడుదల చేయాలని ఒత్తిడి చేశారు. తుంగభద్ర ఆయకట్టు పరిధిలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ, విజయనగర జిల్లాలతో పాటు, పొరుగున ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఆయా జిల్లాలకు కూడా దామాషా ప్రకారం అన్ని ప్రాంతాల రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా నీరు విడుదల చేయాలని ఒత్తిడి చేశారు.
తుంగభద్ర ఆయకట్టు పరిధిలో
రైతులకు శుభవార్త
అన్ని ప్రధాన కాలువలకు
నవంబర్ 10 వరకు సాగునీరు


