కార్మికులను పర్మినెంట్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

Aug 12 2026 12:52 AM | Updated on Aug 12 2026 12:52 AM

రాయచూరు రూరల్‌: కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని కార్మికుల సంఘం డిమాండ్‌ చేసింది. జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రాజశేఖర్‌ మాట్లాడారు. రాష్ట్ర సర్కార్‌ ఆధీనంలో విధులు నిర్వహించే కాంట్రాక్ట్‌ కార్మికులకు కనీస వేతనాలు అందించడంతో పాటు వారిని పర్మినెంట్‌ చేసి సక్రమంగా సౌకర్యాలు, కార్మికుల నమోదు, రెన్యువల్‌, ఆరోగ్య భాగ్య, విద్యా, విశ్రాంతి పింఛను, ఇతర పథకాలను కార్మికులకు అందించాలని కోరుతూ స్థానికాధికారి దేశాయికి వినతిపత్రం సమర్పించారు.

హాస్టల్‌ వార్డెన్‌పై

చర్యలు చేపట్టండి

రాయచూరు రూరల్‌: డాక్టర్‌ అంబేడ్కర్‌ హాస్టల్‌ వార్డెన్‌ ప్రేమలతపై చర్యలు చేపట్టాలని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి సంచాలకుడు రాజు డిమాండ్‌ చేశారు. మంగళవారం డాక్టర్‌ అంబేడ్కర్‌ హాస్టల్‌ జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. గత 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్‌ పద్ధతిపై విధులు నిర్వహించే వారితో ఇతర పనులు చేయించుకుంటున్నారని ఆరోపించారు. వారికిచ్చే కేవలం రూ.10 వేల గౌరవధనంతో కార్యాలయాల్లో పనులు మాత్రమే చేయించుకోకుండా స్వంత పనులకు వినియోగించుకోవడాన్ని ఖండించారు. ఈ విషయంలో వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

గ్రామాల్లో శాంతిని కాపాడాలి

రాయచూరు రూరల్‌: దేశానికి స్వాతంత్య్రం లభించి దశాబ్దాలు గడుస్తున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో శాంతిని కాపాడాలని గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ సీఐ నింగప్ప, ఎస్‌ఐ తిమ్మణ్ణ నాయక్‌ పిలుపునిచ్చారు. మంగళవారం గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాల నివారణపై జరిగిన శాంతి సమావేశానికి అధ్యక్షత వహించి ఆయన మాట్లాడారు. ప్రతి చిన్న విషయాలకు గొడవలు పడకుండా శాంతియుతంగా రాజీ ప్రక్రియ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.

బాగల్‌కోటెలో

500 మీటర్ల జెండావిష్కరణ

రాయచూరు రూరల్‌: దేశానికి స్వాతంత్య్రం లభించిన ఆగస్టు 15న జెండా పండుగ చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం బాగల్‌కోటెలో 500 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జెండాతో నగరంలోని పలు వీధుల్లో సంచరించారు. ఆరోజున మైదానాల్లో పరేడ్‌, జెండా ఎగురవేయనున్న నేపథ్యంలో ప్రజల్లో జాగృతి కల్పించడానికి బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ప్రదర్శించారు.

హత్య కేసు నిందితుల

అరెస్ట్‌కు వినతి

రాయచూరు రూరల్‌: పాత కక్షలను మనస్సులో పెట్టుకుని ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేయాలని దళిత సంఘర్ష సమితి సంచాలకుడు అమరేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. వారం రోజుల క్రితం దేవదుర్గ తాలూకా గబ్బూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని హద్దినాళ వద్ద బీఎస్పీ, దళిత కార్యకర్త భూమానందపై గొడ్డళ్లతో దాడి చేసి చంపిన కేసుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అరకొరగా నిందితులను అరెస్టు చేశారన్నారు. ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేయాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement