సాక్షి,బళ్లారి: దళితులంటే బీజేపీకి గిట్టదు, దళితులు రాజకీయంగా ఎదిగితే బీజేపీ సహించలేదని మంత్రి బీ.నాగేంద్ర పేర్కొన్నారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. వాల్మీకి అభివృద్ధి మండలిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తనకు మంత్రి పదవి ఇవ్వడంతో బీజేపీ నాయకులు ఆగ్రహంతో ఉండటంతో పాటు నాగేంద్రకు వ్యతిరేకంగా అసెంబ్లీలో, బయటా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, మంత్రి పదవికి రాజీనామా చేసే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. అసెంబ్లీలో తాము గట్టిగా సమాధానం చెబుతామన్నారు. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఈ విషయంపై సమాధానం చెప్పారన్నారు. సీఎంతో పాటు మంత్రులంతా ఈ విషయంపై అసెంబ్లీలోనే సమాధానం చెబుతామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు ప్రజల్లో ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారన్నారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, మైనార్టీలు, పేదలకు అన్ని విధాలుగా తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.
అవినీతిలో నా పాత్ర ఏమీ లేదు
వాల్మీకి అభివృద్ధి మండలిలో జరిగిన అవినీతికి సంబంధించి డబ్బులు తిరిగి చెల్లించారని, అందులో తన పాత్ర ఏమీ లేదన్నారు. తప్పు చేసి ఉంటే న్యాయస్థానం తనకు శిక్ష వేస్తుందన్నారు. తాను దోషిని కాదని గుర్తు చేశారు. న్యాయాలయంపై తనకు నమ్మకం ఉందన్నారు. తాను ఆరోపణల నుంచి పూర్తిగా కడిగిన ముత్యంలా బయట పడతానన్నారు. ఢిల్లీ, తిరుపతి, షిర్డీ, కామాఖ్య తదితర దేవాలయాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తాను కోర్టు అనుమతి తీసుకొని వెళ్లానన్నారు. ఈ విషయం తెలుసుకోకుండా బీజేపీ వారు ఆరోపణలు చేస్తున్నారన్నారు. తనకు ఏ శాఖ అప్పగించినా బాధ్యతాయుతంగా పని చేస్తానన్నారు. ఈసారి తాను ఫలానా శాఖే తనకు కావాలని పట్టుబట్టడం లేదన్నారు.
అసెంబ్లీలోనే తగిన జవాబు చెబుతాం
ఏ శాఖ ఇచ్చినా బాధ్యతగా పని చేస్తా
బళ్లారి గ్రామీణ ఎమ్మెల్యే, మంత్రి నాగేంద్ర


